20 August, 2026 | 9:40 PM

జూన్1లోగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తాం

23-05-2024 04:29 AM

యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ 

యాదాద్రి భువనగిరి, మే 22 (విజయక్రాంతి) : యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను జూన్ 1వ తేదీలోగా పూర్తి చేస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,82,330 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోల్లు చేసినట్టు చెప్పారు. 77 కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు జరగడంతో వాటిని మూసివేశామని తెలిపారు. మిగిలిన 246 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ప్రతి రోజు 320 లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నామన్నారు.

ధాన్యం దిగుమతికి ఇబ్బందులు లేకుండా హనుమకొండ జిల్లాకు 10వేల మెట్రిక్‌టన్నులు, జనగామ జిల్లాకు 40వేల మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాకు 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామన్నారు. కొనుగోల్లు పూర్తయిన కేంద్రాల్లోని హమాలీలను ఇతర కేంద్రాలకు పంపించి త్వరితగతిన మిల్లులకు రవాణ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో వర్షాలకు తడిసిన 400 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించామన్నారు.