20 August, 2026 | 7:57 PM

బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ల ఇబ్బందులు

23-05-2024 04:30 AM

ప్రభుత్వం చొరవ తీసుకుని బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి 

కొడంగల్, మే22 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచులు సతమతమవుతున్నారు. పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ రూ.లక్షల్లో బిల్లులు రావాల్సి ఉందని, ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు. పదవీ కాలం ముగిసి మూడు నెలలు కావస్తున్నా  గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లు లు, గ్రామ అభివృద్ది పనుల బిల్లులు అందకపోవడంతో సర్పంచులు ఆందోళన చెందుతు న్నారు.

పదవీలో ఉన్నప్పుడే బిల్లుల కొరకు ట్రైజరీల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. గ్రామాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రభుత్వాలు పదేపదే హమీలు గుప్పిస్తున్నా సకాలంలో గ్రామ పంచాయితీలకు నిధులు అందించండం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు సకాలంలో బిల్లులు రాక ప్రజాప్రతినిధులు అందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేసిన పనులకు నిధులు చెల్లించాలని కోరుతున్నారు.