ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
బోధన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలోని నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యను పీఆర్‌టీయూ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బాధ్యులు ఎంబెల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను శత్రువులుగా చూడటం సమాజానికి ఎంతమాత్రం హితవు కాదన్నారు. ఆదర్శ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయ లోకానికి ఈ ఘటన మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.
సెల్‌ఫోన్‌ను పాఠశాలకు తీసుకురావద్దని సూచించినందుకు ప్రిన్సిపాల్‌ను హతమార్చడం అత్యంత విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక స్థితిలో సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, గురువుల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, నిన్న జరిగిన ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనను పీఆర్‌టీయూ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నట్లు ఎంబెల్లి శంకర్ స్పష్టం చేశారు.






