యాదవుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు
ఏటి యాదవ్ ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన నిరసనలో గొర్రె తల పెట్టి దిష్టిబొమ్మ దహనం చేయడం అత్యంత అవమానకరమని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్ మండిపడ్డారు. సిరిసిల్ల ప్రెస్ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నిరసనల కోసం యాదవుల జీవనాధారమైన గొర్రెలను హింసించడం, వాటిని ప్రదర్శించడం యాదవ సమాజాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అమానవీయ చర్యకు పాల్పడిన బిఆర్ఎస్ నాయకులు తక్షణమే యాదవ కుల బాంధవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు ఇతర నాయకులు పాల్గొన్నారు.






