విమోచన వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం
- శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మాదిరిగా తెలంగాణ మారే ప్రమాదం
- కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అంతర్గతం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): శ్రీలంక(Sri Lanka), బంగ్లాదేశ్(Bangladesh, ), పాకిస్థాన్(Pakistan) మాదిరిగా తెలంగాణ(Telangana) మారే ప్రమాదం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ(Konda Surekha) వ్యవహారం కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంతర్గతమని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ(Telangana Liberation Day) వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)లు మాట తప్పాయన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపడం లేదన్నారు.
తెలంగాణ అమరవీరుల బలిదానాలను పట్టించుకోకపోవడం, సమాజానికి చూపకపోవడం సిగ్గు చేటన్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తి నింపేలా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పొందుపరుస్తామని తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటని, రెండు పార్టీలు కుమ్కక్కు ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే అని, ఇద్దరూ డ్రామా ఆర్టిస్టుల్లా మారారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అవినీతిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని, బీఆర్‌ఎస్ నేతలంతా శుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా? అవినీతికి పాల్పడుతున్న బీఆర్‌ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్‌ఎస్ ఎందుకు నిలదీయడం లేదని, రెండు పార్టీల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
అసెంబ్లీ సభా సమయాన్ని వృథా చేయడం తప్పా రెండు పార్టీలు చేస్తుందేమిటీ అని నిలదీశారు. అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బొమ్మ బొరుసు లాంటివన్నారు. పార్లమెంట్‌లో నల్ల టీషర్టులు వేసుకొచ్చిన రాహుల్‌గాంధీని, కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అక్కడో విధానం, ఇక్కడో విధానం అవలంబించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి నెలకొందని, కర్నాటక సీఎం శివకుమార్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
కేంద్రమే ఆదుకోవాలని శివకుమార్ వేడుకునే దుస్థితి ఉందని అన్నారు. తెలంగాణలోనూ అదే దుస్థితి ఉన్నదని, భూములు అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో “సేవా సంకల్ప్ అభియాన్ -- జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అందులో భాగంగా 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.