7 May, 2026 | 1:28 AM

తడిసిన ధాన్యం సేకరిస్తాం

07-05-2026 12:32 AM
  1. మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం
  2. రైతులు అధైర్య పడొద్దు
  3. మంథనిలో ధాన్యం కొనుగోలు కేంద్రం
  4. పరిశీలనలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

పెద్దపల్లి, మే 6 (విజయక్రాంతి): అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సేకరిస్తామని, ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నదాతలకు భరోసా ఇచ్చారు. మంథని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని, కొనుగోళ్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రవాణా చేసేందుకు అవసరమైన లారీలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మంథని మునిసిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్‌చైర్మన్ ముసుకుల సహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

నైపుణ్యాలతోనే యువతకు ఉద్యోగాలు

నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, మంత్రి, ఎమ్మెల్యేల పట్ల గౌరవం ఉన్నప్పటికీ యువతకు తగిన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు రావని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంఏ మ్యాథ్స్, ఎంఏ ఫిజిక్స్ వంటి విద్యార్హతలు ఉన్నా పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు పొందడం సాధ్యం కాదని యువత గుర్తుంచుకోవాలని సూచించారు.

పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లీ వద్ద గల వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ నాలెడ్జ్ సెంటర్లు ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెద్దపల్లిలో టాస్క్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.

బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు పాల్గొన్నాయని, 4 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చాయని, అయితే 1500 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్ అయ్యారని తెలిపారు. గోల్ మెడలిస్టు అయినా సరే సాఫ్ట్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోతే పరిశ్రమలకు పనికిరారని పేర్కొన్నారు. యువతకు తగిన నైపుణ్యాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీ సెంటర్లు, టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకునే పెద్దపల్లి యువతకు స్కిల్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించడం తన బాధ్యత అని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) దేశంలోనే ప్రత్యేకమైన వేదికగా ఉందని, ఇందులో నమోదు చేసుకుంటే అభ్యర్థుల నైపుణ్యాలను విశ్లేషించి తగిన పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ వేదికలో నమోదు కావాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతి నిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.