22 May, 2026 | 2:13 PM

చివరి గింజ వరకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

22-05-2026 01:20 PM
  1. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు, రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత
  2. వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం
  3. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం
  4. పత్రికా ప్రకటనలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి,(విజయక్రాంతి): రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి  దుదిల్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.

గతంలో వివిధ కారణాలు చూపిస్తూ బస్తాకు 5 నుంచి 10 కిలోల కోతల పరిస్థితులు ఉండేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అలాంటి కోతలు, పరిమితులు అనుమతించబోమని స్పష్టం చేశారు.  రైతులు పండించిన చివరి గింజ వరి, మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన లారీలు, రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు.  అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులు కొంత సహనంతో అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలకు గురై తక్కువ ధరలకు పంటను అమ్ముకోవద్దని రైతులకు సూచించారు.