5 April, 2026 | 12:27 AM

ఆమనగల్లుకు పూర్వ వైభవం తెస్తాం

04-04-2026 09:39 PM

* ఎంపీ డాక్టర్ మల్లు రవి

ఆమనగల్లు: గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆమనగల్లు ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధిలో వెనుకబడిన ఈ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తామని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ​శనివారం ఆమనగల్లు పట్టణంలో రూ. 4 కోట్లతో చేపట్టిన బీసీ హాస్టల్ భవన నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులుతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విద్యా రంగంలో ఆమనగల్లును అగ్రగామిగా నిలిపేందుకు తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామం వద్ద 25 ఎకరాలలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల భూ వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని, భవన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

* ​ఫ్యూచర్ సిటీ ప్రభావం...

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుతో ఆమనగల్లు ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, ఇది ఈ ప్రాంతానికి ఒక వరం అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ఏసీబీ కార్యాలయాన్ని తీసుకువచ్చామని, త్వరలోనే అన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

​"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమన్వయంతో ఆమనగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతాం అని ఎంపీ హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.