28 May, 2026 | 2:36 AM

వందేమాతరానికి ముందు రాష్ట్ర గీతం ఆలపిస్తాం

28-05-2026 01:09 AM
  1. కేంద్రహోంశాఖకు ఆదేశాలివ్వండి
  2. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి
  3. సీఏం పదవి చేపట్టాక తొలిసారి ప్రధానితో భేటి

న్యూఢిల్లీ, మే27: వందేమాతరానికి ముం దు తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపిస్తామని, కేంద్రహోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, అనుమతులు ఇవ్వకుండా జలశక్తి మంత్రిత్వ శాఖకు, కేంద్ర జలవనరుల ట్రిబ్యునల్‌కు సూచించాలని కోరారు. డీఆర్డీఓకు చెందిన సీఏబీఎస్ కేంద్రాన్ని తమిళనా డులో ఏర్పాటు చేయాలని,

అలాగే రాష్ట్రంలోని కీలక సమస్యలను త్వరగా పరిష్కరిం చాలని ప్రధానికి విజయ్ వినతిపత్రం అందజేశారు. విజయ్ తమిళనాడు ముఖ్యమం త్రిగా బాధ్యతలు స్వీకరించాక బుధవారం దిల్లీలో ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో తొలిసారి సమావేశమయ్యారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకర ణాలకు దారితీస్తుందనే చర్చ మొదలైంది. న్యూఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో ప్రధానితో సీఎం  విజయ్ సమావేశం సుమా రు 25 నిమిషాల పాటు సాగింది. వందేమాతరం వివాదం, మేకేదాటు ప్రాజెక్టు వివాదం, రక్షణ ప్రాజెక్టులు, శ్రీలంక నావికాదళం చేతిలో తమిళ మత్స్యకారుల అరెస్ట్ వంటి అంశాలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

వందేమాతరం కంటే ముందే తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించేలా కేంద్ర హోం శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజయ్ ప్రధానిని కోరారు. తమిళ సంస్కృతి, అధికారిక నిబంధనల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదంపై చర్చించారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టును విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న భూమి పూజ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ వివాదంతో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాల అనుమతి లేకుండా మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని జలశక్తి మంత్రిత్వ శాఖకు, కేంద్ర జలవనరుల ట్రిబ్యునల్‌కు సూచించాలని కోరారు. శ్రీలంక నావికాదళం తమిళనాడు మత్స్యకారులపై దాడులు చేయడం, వారిని అరెస్ట్ చేయడం వంటి అంశాలపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 58 మంది తమిళ మత్స్యకారులు శ్రీలంక జైళ్లలో ఉన్నారని, వారి 288 పడవలను సీజ్ చేశారని ప్రధానికి వివరించా రు.

వారిని, వారి పడవలను త్వరగా విడిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రక్షణ రంగంలో తమిళనాడు పట్టును బలోపేతం చేయడానికి డీఆర్డీఓకు చెందిన సీఏబీఎస్ కేంద్రాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ తన ఢిల్లీ పర్యటనలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లను కూడా కలవనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా విజయ్ సమావేశం కానున్నారు. 

అయితే తమిళనాడులో మారిన రాజకీ య పరిస్థితుల నేపథ్యంలో విజయ్ దిల్లీ పర్యటన దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీని సీఎం విజయ్ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలను పీఎంవో ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అలాగే ఇటీవల నెద ర్లాండ్స్ పర్యటన సందర్భంగా ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటన విడదల చేసింది.