28 May, 2026 | 2:32 AM

సర్ చట్టబద్ధమే!

28-05-2026 01:08 AM
  1. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ఈసీకి సర్వాధికారాలు 
  2. నిరంతరం అప్‌డేట్ తప్పనిసరి 
  3. పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు 
  4. ‘సర్’లో పేర్లు చేర్చుకోకపోతే పౌరసత్వం కోల్పోరని స్పష్టీకరణ

ఢిల్లీ, మే 27(విజయక్రాంతి): ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. ‘సర్’ నిర్వహణకు సర్వాధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఉన్నాయని తేల్చి చెప్పింది. ‘సర్’ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు  బుధవారం కీలక తీర్పును వెలువరించింది.

ఈసీకి ‘సర్’ నిర్వహణ అధికారం లేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 నాటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిం చారు. అయితే, ఈ వాదనలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారాలను, ముఖ్యంగా ఎన్నికల సమగ్రతను కాపాడే క్రమంలో ఈ ప్రక్రియ ఎంత కీలకమో కోర్టు తన తీర్పులో వివరించింది. 

రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే..

బీహార్, పశ్చిమ బంగాల్ తదితర రాష్ట్రాల్లో ఈసీ నిర్వహించిన సర్ ప్రక్రియ రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్ని కల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను నిరంతరం అప్‌డేట్ చేయాల్సిన అవసం ఉం దని అభిప్రాయపడింది. ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను ‘సర్’ ముందుకు తీసుకెళ్తోంది.

ఓటర్ల జాబితాల్లో సమగ్రత, కచ్చిత త్వం, విశ్వసనీయత ముఖ్యం. ఈ ప్రక్రియ ప్రస్తుత ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడం లేదు. ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఈసీ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందాం’. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘సర్’లో పేరు లేనంత మాత్రాన ఎవ్వరూ తమ పౌరసత్వం కోల్పోరని  స్పష్టం చేసింది.    

వేగవంతం కానున్న ప్రక్రియ..

కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే, దేశంలోని బీహార్, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బంగాల్ వంటి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 30 నుంచి 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత, చివరి దశ సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్వేలకు చట్టపరమైన భద్రత లభించడంతో, పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.