మరణించిన ఉద్యమకారులను గుర్తించాలి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులతో పాటు వివిధ కారణాలతో మరణించిన ఉద్యమకారులను సైతం గుర్తించాలని జిల్లా ఉద్యమకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్ర వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డ ఉధ్యమకారులకు గుర్తింపు నివ్వాలని రాష్ట్ర స్థాయి కమిటీ నియమించిందని, ఈ కమిటీ సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందని, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తొలి, మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న వారిని గుర్తించాలని కమిటీ సభ్యులు ఎంఎల్సీ, ప్రొపెసర్ కోదండరాం, కే కేశవరావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్ లను కలిసి విన్నవించామన్నారు.
తెలంగాణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారిని గుర్తించడంతో పాటు రాష్ట్రం వచ్చాక మరణించిన వారిని సైతం గుర్తించాలని కోరగా కమిటీ సానుకూలంగా స్పందించిందన్నారు. ఉధ్యమంలో పాల్గొని రాష్ట్రం ఏర్పడిన తరువాత మరణించిన ఉధ్యమకారుల కుటుంబ సభ్యులు ఆధార్ కార్డుతోపాటు మరణ ద్రువీకరణ పత్రం, ఒక పాస్ ఫోర్టు సైజ్ ఫోటోతో తమను సంప్రదించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో 1523 రోజులపాటు నిర్విరామంగా నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించిన కారింగుల దామోదర్ తో పాటు తుడుం రాములు, జి.నర్సింలు, ఏనుగు రతన్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.






