ఎన్నికల హామీలపై నిలదీస్తాం
* రైతుల సమస్యల పట్ల సర్కార్ నిర్లక్ష్యం
* రైతు భరోసాకు కాంగ్రెస్ ఎగనామం
* గురుకుల పాఠశాలలు నిర్వీర్యం
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్/సిద్దిపేట, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, రుణమాఫీ అరకొరగా చేసిందని, ధాన్యానికి బోనస్, మద్దతు ధర, రైతు కూలీల అంశాలపై సభలో ప్రస్తావిస్తామని చెప్పారు.
గురుకులాల్లో నెలకొన్న సంక్షోభం, బడుగు, బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తు ఆధారమైన గురుకులాలను ప్రభుత్వం పతనావస్థకు చేర్చిందని మండిపడ్డారు. గురుకుల బాట పేరుతో చేపట్టిన పర్యటన తరువాత ఇచ్చిన నివేదికను రూపొందించి కేసీఆర్‌కు అందజేసినట్టు తెలిపారు. గతంలో గురుకులాలను బీఆర్‌ఎస్ అద్భుతంగా తీర్చిదిద్ది నట్లు, వాటిని రేవంత్ సర్కార్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూములు సేకరించి పరిశ్రమల స్థాపనకు అన్ని సిద్దంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజీల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటున్న కుట్రలపై సభలో నిలదీస్తామని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై గ్రామాల పరిస్థితుల నిర్వహణ, సర్పంచుల పెండింగ్ బిల్లులు వైఫల్యాలను ఎండగడుతామని చెప్పారు. దళిత బంధు రెండు విడుత ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ దళిత సోదరులకు దూరం చేస్తున్న కాంగ్రెస్‌ను తీరును ప్రశ్నిస్తామన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, గిరిజనులకు ఇచ్చిన డిక్లరేషన్‌పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టంచేశారు.






