వాతావరణ హెచ్చరికలు!
ఇప్పుడు ప్రపంచమంతా వశీకరణలాగా ప్రపంచీకరణ ఆవహించింది. ప్రతి దేశంలో ప్రతీ ప్రభుత్వం అప్పో, సప్పో చేసి ఏదో ఒక ప్రాజెక్టు చేపడుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తో లేక అసంపూర్తిగానో మిగిలిపోయి ప్రజల పొలాల్లోకి కన్నీళ్లుగా పారుతుంటాయి. ఏలికల జేబుల్లోకి రూపాయల వరద పోటెత్తుతుంది.
ఒకవైపు గజగజమంటూ వణికించే చలి. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కాలం నిన్నటి గతానికి వీడ్కోలు పలికి రేపటి భవిష్యత్తుకు స్వాగతం చెప్తూనే ఉంటుంది. 2025 అనే ఒక మైలురాయిని దిగ్విజయంగా దాటి 2026లోకి ఏకధాటిగా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఆ దారి అంతా ఫైర్ ఇంజన్ల లాంగ్ బెల్ మోతలే వినిపిస్తున్నాయి. వేగంతో అత్యవసరంగా కదిలే అంబులెన్స్ల్ కూతలు పెడుతూ పరిగెడుతుంటాయి.
కుతూహలం నిన్ను ఒక్కచోట కూర్చోనివ్వదు.‘సాలు లేదు మూలు లేదు కాలం కరవాలంపై నీపై నీ శరీరంపై నీ ఆలోచనలపై దాడి చేస్తూనే ఉం టుంది. కాలాలన్నీ ఎటమటమై పోతున్నా యి శీతకాలం చలి ఎక్కువే.. ఎండాకాలం వేడి ఎక్కువే.. వానాకాలం అకాల వర్షాలు, కుండపోతలు ఎక్కువే. నా చిన్నప్పటి అడవి ఇప్పుడు మైదానం అయిపోయింది. మా ఊరి గుట్ట ఇప్పుడు గుటకాయ స్వాహా అయిపోయింది. మా మానేరు వాగులో కళకళలాడే నీటి గలగల చెలిమెలు చూస్తుం డగానే ఇంకిపోయాయి.
కొనుక్కో లేదంటే అమ్ముకో!
మనిషి చుట్టూ అల్లుకున్న బంధాలు, మానవ సంబంధాలు పుటుక్కున ఎప్పుడైనా తెగిపోవడానికి సిద్ధంగా లుకలుకలా డుతున్నాయి. ఒక నెనరు లేనితనం జల్లెడలా ఆవహించి అతలాకుతలం చేస్తున్నది. దేనినైనా వస్తువుగా చేసి అందంగా అలంకరించి, షాపింగ్ మాల్ షో కేసుల్లో పెట్టి విక్రయించడానికి సిద్ధంగా ఉండాలి. బేర సారాలు లేవు. క్యూఆర్ కోడ్‌లోనే ధరకు సంబంధించినవన్నీ బంధించబడి ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు.. పగటి వెలుతురులో వినియోగదారుడిగా షాపు యజమానికి దగదగ మెరుస్తూ దర్శనమిస్తావు. ‘టు బి ఆర్ నాట్ టు బి’ తప్పదు. అయితే కొనుక్కో లేకుంటే ఏదో ధరకు అమ్ముకో. ఇక మార్కెట్‌లో దళారీ మారువేశంలో తిరుగుతుంటాడు. దేశం సమస్తం కనపడుతుంది. సృష్టి అంతా సంతాన సాఫల్య కేంద్రాల నుంచే. దృష్టి అంతా లాభలే మీదే.
సహజ సౌందర్యం కోల్పోయిన ఆడ, మగ, పిల్లా, జెల్లా, గొడ్డూ, మేకా బ్యూటీ పార్లర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దక్షిణ ఇస్తుంటారు. ముఖానికి వేసుకొనే మేకప్ ఆహార్య మంతా సుఖ దుః ఖాలను ప్రతిబింబించదు. కన్నీళ్లు అయినా.. కష్ట సుఖాలైన మౌనంగా నీలోనే కుంగి కృషించి గొంతెత్తకుండా సమాధి అయిపోవాలి. ధనుర్మాస ఉత్తర ద్వార దర్శనాలు. ఇక్కడ మద్యం, మాదకద్రవ్యం స్వీకరించు. ఇక్కడ ఖాకీ చేతిలోని సెన్సార్‌లో ఊదు. నీ జేబులో డబ్బు లేకు న్నా పెద్దగా ఇబ్బంది లేదు.
అంతా పట్వారి అడ్డగోలు.. జమా బందీ లెక్కలే. జరిమానా ఎంత చెల్లించాలో నీ సెల్‌ఫోన్‌కే సమాచారం వచ్చేలా చేస్తాయి రొడ్డ కొట్టుడు ప్రభుత్వాలు. మద్యం అమ్మకాలే కాదు. అరొక్క సహజ వనరుల అమ్మకాలపైన నాలుగు కాళ్ల రామరాజ్యం నడుస్తుంది. అంతా ఇంతే. ఎడమ చేయితో ఇచ్చి కుడి చేతితో కాజేయడం. అది ఏదైనా కావ చ్చు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఏదైనా కావొచ్చు.. విద్యా, వైద్యం అన్నీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే నేర్పబడుతాయి. వాటికి చికిత్స అందించబడుతుంది. నర్సులు, డాక్టర్లు ఆసుపత్రి అంతా కాంతివంతంగా.. నీ నీడ నీకు కనబడేదంతా వైట్ కాలర్ కురవని నల్లని మేఘం నిన్నూ, నన్నూ కుమ్ముతుంది.
పొలాల్లోకి కన్నీళ్లుగా..
కొత్త సంవత్సరం. అది రేషన్ షాప్ కాదు. ఏటీఎం మిషన్ కాదు. మహా ప్రభువులు మన తిప్పలకు కనికరించి హుకుం జారీ చేశారు.పొద్దుగాల ఆరు నుంచే మద్యం షాపులు తెరిచి ఉంటాయి. న్యూ ఇయర్ రోజున ఫూటుగా మద్యం తాగి, తందనాలాడి దానిని ఒక పండగలా చేసుకో అని ఆజ్ఞాపిస్తారు. మరునాడు తెల్లారి లేస్తే ‘నిన్న నేనేం చేయలేదు’ అని పచ్చి అబద్ధంగా బనాయించుకో. 78 ఏళ్ల స్వేచ్ఛా భారతంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం మారిందోయ్! అది ఏ విధంగా మారిందో తెలుసా! ఉపాధి హామీ పథకం నుంచి జీ రామ్ జీ పథకంగా మారిందన్న విషయం తెలుసుకో!!. ఇంక మనం కలిగిన కాడికి బర్కత్‌గా వండుకోవచ్చు.
ఉన్నకాడికి తిని, కడుపులకు కాళ్లు మలుచుకొని హాయిగా పండుకోవచ్చు. ఇక కప్పుకునేందుకు, పరుసుకునేందుకు మన ఒంటి మీదికి నిండా గొంగడి ఉండనే ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా వశీకరణలాగా ప్రపంచీకరణ ఆవ హించింది. ప్రతి దేశంలో ప్రతీ ప్రభుత్వం అప్పో, సప్పో చేసి ఏదో ఒక ప్రాజెక్టు చేపడుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తో లేక అసంపూర్తిగా నో మిగిలిపోయి ప్రజల పొలాల్లోకి కన్నీళ్లుగా పారుతుంటాయి. ఏలికల జేబుల్లోకి రూపాయల వరద పోటెత్తుతుంది. షాన్ షాందార్‌గా పరేషాన్ అనే ఎయిట్ లైన్స్ రోడ్డు మీద ప్రయాణిస్తుంది.
అంతా తక్లీబ్ తక్లీబ్!
గడ్డి గాడ్పుకు పోతేంది? ఎడ్లు ఏట్లెకు పోతే ఏందీ? ఏది ఎటు పోతే నీకేంది? మస్తు మజా చేసుకోవడమే మనకున్న లక్ష్యం. కుట్టేటోడు కుడితే చెవ్వులు నొయ్యయ్! తాగినోడు తాళ్ల పన్ను కట్టాల్సిందే.. బంజేరు దొడ్లో పడ్డ జంతువు పామాయిల్ కట్టాల్సిం దే. చెవులు పిండి చేతికి ఇచ్చినట్టు వుందిరా భై.. ‘దీని అవ్వ బతుకు!అంతా తక్లీబ్ తక్లీబ్!’. హరి నామస్మరణ ఎంత చేసినా ఏం ఫాయిదా! ఏడుకొండలు నడిచి ఎక్కితే కాళ్లు నొచ్చె! గోవిందా అని అంటే నోరు నొచ్చె!! ఎవరికీ చెప్పుకోలేము ఈ కష్టం.
ఇలాంటి క్లిష్టమైన కష్టం ఆ భగవంతునికి కూడా రావొద్దు. నిప్పుల్ల బొర్రించినట్టు అరిగోస.. అరిగోస! పంటలను హార్వెస్టర్ కోస్తది. తుర్పార పడుతది. తీరా జోకే కాడ పొల్లు నూకయితుంది. తడి ఉంది.. ఇంకేదో ఉంద నే సాకు జెప్పి దాని పేరు మీద మూడు కిలోల ధాన్యం తరుగుపట్టి తీస్తనే ఉంటరు. ఇక రైతుకు మాత్రం లాగేటోడి కైకిళ్లు, ఇతర ఖర్చులు ఫోను మిగిలేది అప్పుల తిప్పలే. అప్పులకు మిత్తికి ఇచ్చినోళ్ల నుంచి ఒత్తిడి పెరిగిపోతే రైతుకు ఇక మిగిలేది ఉరి లేదంటే ఆత్మహత్యే శరణ్యం.
పానమంతా అవిశిపోతుంది. బతుకంతా నవిశి పోతుంది. మనసంతా కలికలి అవుతుంది. గతి లేని సంసారం చెయ్యవచ్చు గానీ సుతిలేని సంసారం చెయ్యరాదు. జనజీవన స్రవంతిలో కలవడమో.. లేదా జెన్‌జీ తరం అంతరం ఎటు పోటెత్తుతుందో అటు పోవుడే. ఏదో ఒకటి చల్ చల్ గుర్రం.. నాటి నుంచి నేటి దాకా గిదే తంతు. ఆవులావులు కొట్లాడి లేగల కాళ్లు విరగొట్టడం అంటే ఇదేనేమో. మందికి చూడ అన్ని ఫాల్తూ మాటలే! అది నోరా?లేక మోరా??.
వ్యాసకర్త సెల్: 9441078095
-జూకంటి జగన్నాథం






