02-01-2026 12:00:00 AM
ఒకవైపు అమెరికా కఠిన ఆంక్షలు.. మరోవైపు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు సవాళ్లు విసురుతున్నా ఆర్థిక రంగంలో భారత్ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రపంచంలో ఆర్థికంపరంగా శక్తివం తమైన దేశాల జాబితాలో భారత్ దిగ్విజయంగా మరో అడుగు ముందుకేసింది. తాజాగా జపాన్‌ను అధిగమించిన భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం దేశ జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కేంద్రం పేర్కొన్న ప్రకారం ప్రస్తుతం జపాన్‌ను అధిగమించిన భారత్ మరో మూడున్నరేళ్లలో జర్మనీని కూడా దాటే అవకాశముంది. 2030 నాటికల్లా 7.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 4.51 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుంది. ప్రస్తుతం భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే ముందున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2 శాతం మేర పెరిగింది.
అంతకుముందు రెండు త్రైమాసికాల వృద్ధి రేటుతో పోలిస్తే ఇది అధికం. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దేశీయ వినియోగం పెరగడం, మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, తయారీ రంగం పుంజుకోవడం కీలక కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఎకానమీలో వచ్చిన మార్పులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారత్‌ను ప్రపంచ వేదికపై జపాన్‌ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నా దేశీయం గా డిమాండ్ బలంగా ఉంది. మరోవైపు జనాభా తగ్గిపోవడం, అధికారం చేతులు మారడం, కరెన్సీ విలువ పడిపోవడం లాంటి సమస్యలు జపాన్ ఆర్థిక శక్తిని కుంగదీశాయని చెప్పొచ్చు.
ఇదే విధంగా ముందుకు సాగితే మరో మూడేళ్లలో జర్మనీని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యమివ్వడం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం లాంటి చర్యలు రాబోయే కాలంలో కీలకం కానున్నాయి. వృద్ధి పరంగా దూసుకెళ్తున్న దేశీ డిజిటల్ మార్కెట్ రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌కు చాలా కీలకం కానుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, నిరుద్యోగిత శాతం తగ్గడం, ఎగుమతులు భారీగా పెరగడం వంటి అంశాలు నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి.
ఈ ఎదుగుదల అంకెలకు పరిమితం కాకుండా సామాన్యుల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు మరిన్ని ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడనుంది. అంతేకాదు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌ను ఒక సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి కేంద్రంగా చూస్తున్నాయి. ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాల దిశగా నడిపిచేందుకు దోహద పడనున్నాయి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో.. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమం లో బలమైన నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక పురోగతి దిశగా భారత్ అడుగులు వేయాలని ఆశిద్దాం.