ఆది నిష్ఠూరం మంచిదే !
చేతులు కాలాక
ఆకులు పట్టుకోవటం కన్నా
ముందుగా అప్రమత్తత
అవసరమే
బతుకంతా ఎన్నో ఆటుపోటుల్ని
ఎదుర్కొన్నావు కదా..
నీ మొహమాటం నిన్ను చాలా
ఇబ్బంది పెట్టిన ఘడియలు
కోకొల్లలుగా వుండి ఉంటాయి
బాగా గుర్తు తెచ్చుకో..
మాట ఇచ్చి బొటన
వేలు త్యజించిన
ఏకలవ్యుడిలా
విలవిల్లాడి ఉంటావు
మేలుకోసం పోయి కీడును
తోడు తెచ్చుకున్న సందర్భాలూ..
నిన్ను అంటి పెట్టుకున్న
జ్ఞాపకాలే కదా..
అన్నీ తెలిసి తెలిసి చేస్తాం..
మన వల్ల కాకుంటే కాదని
మొఖం మీదే..
అప్పటిది అప్పుడే
చెప్పలేక పోవటం
నీలోని న్యూనతను
పెంచి పోషించటమే..
నిన్ను నీవు కోల్పోయి
అది నీ పీకనొక్కే
సమయవ వస్తుంది
నీ కంటూ నువ్వేమీ
చేసుకోలేని
క్షణాలూ వస్తాయి
అందుకే..
నీ ముందు
ఏ తురుంఖాన్ ఉన్నా..
నీకు వీలు కాని పనిని
చేయలేనని గట్టిగా
వక్కాణించి చెప్పు
అంత్య నిష్ఠూరం కన్నా...
ఆది నిష్ఠూరం
చాలా మంచిదే !!
రమేష్






