26 June, 2026 | 2:29 AM

సంక్షేమమే ప్రజాప్రభుత్వం అజెండా

26-06-2026 12:32 AM
  1. ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు
  2. హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ విద్యానిధిపై ప్రత్యేక దృష్టి
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. గురువారం సచివాలయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్ మెంట్స్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రు లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రైవేట్ భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు హాస్టల్లో గురుకులాలలో మరమ్మతు పనులు ఒక నెలలోపు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అలాగే 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు చెప్పారు. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల రెంట్ చార్జీలు, డైట్, కాస్మోటిక్ చార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు పంపాలని ఆయా శాఖ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులకు సంబంధించిన బిల్లులు ఏ కారణం చేతనైనా పంపక పోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అధికారులను హెచ్చిరించారు. స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, యూపీఎస్సీ, గ్రూప్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయశాతాన్ని పెంచాలన్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. అంబేద్కర్ టవర్, బాబూ జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాల నిర్మాణానికి సంభందించి నెలవారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

అన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈవీ ద్విచక్ర వాహన (స్కూటర్) పథకంకు సంభందించిన పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. అన్ని జిల్లాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.  రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు నెలకు రూ.29 కోట్ల నిధుల అవసరం ఉందని అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు.

వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు చేయాలని కోరారు. రూ.27 కోట్ల పెండింగ్ అద్దె చెల్లింపులను విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్ చైల్ డెవలప్మెంట్ కార్యదర్శి అనిత రామచంద్రన్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి విజయేంద్ర బొయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.