జూన్ 25 భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజు
కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలు..
పోరాట యోధులను సన్మానించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
ముకరంపుర, జూన్ 25 (విజయక్రాంతి): భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25వ తేదీ అత్యంత భయానకమైన ’చీకటి రోజు’ లాంటిదని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దేశంలో ఎమర్జెన్సీ విధించి విధ్వంసాన్ని సృష్టించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
గురువారం రోజున కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలను బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడి, జైలు శిక్షను అనుభవించిన పోరాట యోధులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ మేకల ప్రభాకర్ యాదవ్, బిజెపి నాయకులు కార్యకర్తలు కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని విధించిన అత్యవసర పరిస్థితి భారత దేశానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. స్వతంత్ర భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అన్నారు. ఎమర్జెన్సీ సందర్భంగా నాటి పాలకుల అహంకారంతో అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి రాజ్యాంగాన్ని వారికి కావలసిన విధంగా మార్చుకొని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లలో బంధించి, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారన్నారు.
ముఖ్యంగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆ రోజుల్లో ఇందిరాగాంధీని పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించిందని, ఎన్నికల్లో పాల్గొనకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించిందన్నారు. ఆ తీర్పును జీర్ణించుకోలేకనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని దారుణాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఆపదలో ఉందని చెప్పడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉందన్నారు.
అందుకే జూన్ 25 అనేది భయానకమైన చీకటి రోజు అని, ఆ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుల త్యాగాలను మనం ఎప్పటికీ మరువలేమన్నారు.. నేటి యువతకు, భావితరాలకు అప్పటి దారుణ పరిస్థితులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ దిశలోనే బిజెపి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎమర్జెన్సీ దినోత్సవ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రోగ్రాం కన్వీనర్ మేకల ప్రభాకర్ యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ,జిల్లా ఉపాధ్యక్షులు కళ్ళెం వాసుదేవ రెడ్డి, కన్నా కృష్ణా, కార్పోరేటర్ బండ రమణ రెడ్డి, అనిల్, అడిచెర్ల రాజు, మండల అధ్యక్షులు బండారి గాయిత్రి తదితరులు పాల్గొన్నారు.






