25-05-2025 12:06:01 AM
నిర్ణీత గడువు లోపు గ్రామాలలో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి..
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..
తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లల పాలన సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా నుండి మన్నెగూడెం వరకు రూ 3.75 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, పాతర్లపాడు క్రాస్ రోడ్ నుండి రావి చెట్టు తండా రోడ్డు వరకు రూ 27 కోట్ల అంచనా విలువతో రెండు వరుసల రహదారిగా అభివృద్ధి పరుచు పనులు, మహ్మదాపురంలో బోడతండ నుండి సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు నుండి భవాని గుడి వరకు రూ 3.15 కోట్లతో బిటి రోడ్డు, తెట్టెలపాడు గ్రామంలో ఏడు అంతర్గత సిసి రోడ్లు, గోపాలపురం నుండి జల్లేపల్లి వరకు రూ 38 కోట్ల రూపాయిలతో రెండు వరసల రహదారి పనులకు, చిన్న పోచారం నుండి కిష్టాపురం తాళ్ళచెరువు జెడ్పి రోడ్డు వరకు రూ 2.80 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు.
జీళ్ళచెరువు గ్రామంలో సూర్యాపేట- అశ్వరావుపేట రోడ్డు నందు రూ 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామం, మండలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి లకు ప్రాధాన్యత నిస్తూ పాలన సాగిస్తుందన్నారు.
ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా నిరుపేదలకు ఉగాది నుండి సన్న బియ్యం సరఫరా చేస్తుందని, ఇందిరమ్మ కమిటి అందించిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిరుపేదలకు అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ 500 బోనస్ ఇచ్చామని, యాసంగి సీజన్ లో కూడా రైతులకు బోనస్ చెల్లిస్తామని అన్నారు. రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించే దిశగా భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకున్నామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ క్రింద పేద కుటుంబానికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు పరిమితిని 10 లక్షలకు పెంచామని అన్నారు. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ 500 గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ నిరుపేదలకు ఇచ్చిన భరోసా ప్రకారం చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఇచ్చిన ప్రతి మాటను పేదవానికి చేర్చడానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి అన్నారు.
మంత్రి తన పర్యటనలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకుబ్, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, హౌసింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏడిఏ సరిత, తిరుమలాయపాలెం తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపిడివో సిలార్ సాహెబ్, కూసుమంచి మండల ఇన్ చార్జి తహశీల్దార్ కరుణశ్రీ, ఎంపిడివో వేణుగోపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.