21 July, 2026 | 9:13 AM

'ఓటరు' సవరణలో పాల్గొనకుంటే సంక్షేమ పథకాలను నిలిపివేయాలి

20-07-2026 08:36 PM

- టీ పీసీసీ అధికార ప్రతినిధి, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 

 ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి 

ఎల్బీనగర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) పాల్గొనని, సహకరించని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కోరారు. అవసరమైతే రైతు భరోసా, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపి వేయాలన్నారు. లింగోజిగూడ వార్డు కార్యాలయంలో సోమవారం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్, బూత్ లెవల్ ఆఫీసర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఆయన మాట్లాడి, డిజిటైజేషన్ పనుల పురోగతి, డేటా ఎంట్రీ, వెరిఫికేషన్ ప్రక్రియలను సమీక్షించారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పనులను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ అన్నారు. ప్రతి ఫారంలోని వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు.

ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియలో పాల్గొనడం ప్రతి ఓటరు బాధ్యత అని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు కేవలం 37 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే నమోదు కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటరు హక్కును బాధ్యతగా భావించి, ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ కు వెంటనే అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.