అంచనాల్ని మించిన జీడీపీ
న్యూఢిల్లీ, మే 31: దేశ, విదేశీ విశ్లేషకుల అంచనాల్ని తలదన్నిన భారత్ ఆర్థిక వ్యవస్థ గణాంకాలు వెలువడ్డాయి. 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిచెందగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 8.2 శాతానికి చేరిందని శుక్రవారం జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది. తయారీ రంగం మంచి పనితీరు కనపర్చడంతో కూ4లో వృద్ధి జోరుగా పెరిగిందని తెలిపింది. ఈ జనవరి మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.8 శాతం ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక రంగ నిపుణులు, దేశ, విదేశీ బ్రోకరేజ్‌లు, విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాల్ని భారీస్థాయిలో అధిగమించడం గమనార్హం. అయితే 2023 అక్టోబర్ మూడో త్రైమాసికంలో సాధించిన 8.6 శాతంకంటే తాజాగా ముగిసిన క్యూ4లో వృద్ధి రేటు తక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థ 2023 జూలై 8.1 శాతం, 2023 ఏప్రిల్ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 జనవరి క్వార్టర్లో జీడీపీ 6.2 శాతం వృద్ధిచెందింది.
3.5 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ
తాజా వృద్ధి రేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. వచ్చే కొద్ది ఏండ్లలో 5 ట్రిలియన్ డాలర్లను చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. గత 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా ఉన్నది. ప్రస్తుత ఏడాది తొలి మూడు నెలల్లో చైనా 5.3 శాతం ఆర్థికాభివృద్ధిని సాధించింది. తాజా ఎన్‌ఎస్‌వో గణాంకాల మేరకు 2023 స్థిర ధరలపై వాస్తవ జీడీపీ రూ.173.82 లక్షల కోట్లకు చేరింది. 2022 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.160.71 లక్షల కోట్లు.
ఈ మేరకు 2023 వాస్తవ జీడీపీ 8.2 శాతం వృద్ధిచెందినట్లయ్యిందని ఎన్‌ఎస్‌వో తెలిపింది. 2022 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా ఉన్నది. ప్రస్తుత ధరల ప్రకారం 2023 జీడీపీ రూ.295.36 లక్షల కోట్లకు చేరగా, 2022 రూ.269.50 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2024 మార్చి త్రైమాసికంలో స్థిర ధరల ప్రకారం వాస్తవ జీడీపీ గత ఏడాది క్యూ4తో పోలిస్తే రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు పెరిగింది. దీని ప్రకారం 7.8 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే త్రైమాసికంలో ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వ్యవస్థ రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు పుంజుకున్నది.
రంగాల వృద్ధి ఇలా
ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 7.2 శాతం వృద్ధిచెంది రూ.148.05 లక్షల కోట్ల నుంచి రూ. 158.74 లక్షల కోట్లకు పెరిగింది. జీడీపీ నుంచి సబ్సిడీలు తీసివేసి, పన్నులు కలిపితే వచ్చేదే జీవీఏ. 2024 జనవరి త్రైమాసికంలో తయారీ రంగం జీవీఏ వృద్ధి 8.9 శాతానికి జోరందుకున్నది. ఏడాది క్రితం ఇది 0.9 శాతమే. మైనింగ్ రంగం జీవీఏ వృద్ధి 2.9 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం వృద్ధి రేటు 7.4 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం వృద్ధి రేటు మాత్రం 7.6 శాతం నుంచి 0.6 శాతానికి పడిపోయింది. విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల విభాగం వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి చేరింది. ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ తదితరాలతో కూడిన సర్వీసుల రంగం జీవీఏ వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసుల వృద్ధి సైతం 9.2 శాతం నుంచి 7.6 శాతానికి పడిపోయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సర్వీసుల వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది.






