29 April, 2026 | 3:25 AM

వైద్యానికని వెళ్తే గర్భ విచ్ఛిత్తికి మందులు!

29-04-2026 02:00 AM
  1. రాసిచ్చిన డాక్టర్
  2. నిలదీసిన బాధితురాలి బంధువులు
  3. నల్లగొండ పట్టణంలో ఘటన

నల్లగొండ క్రైమ్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): ఆరోగ్యవంతంగా ఉన్న పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ఓ గర్భిణి నల్గొండ పట్టణంలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ గర్భ విచ్ఛిత్తికి మాత్రలు రాయడం కలకలం సృష్టించింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నల్లగొండ పట్టణ సమీపంలోని గెరికబాయిగూ డేనికి చెందిన కిరణ్మయి గర్భం దాల్చినప్పటి నుంచి వేణు విద్య మల్టీస్పెషల్టి హాస్పిటల్‌లో వైద్య సహాయం పొందుతున్నట్లు తెలిపారు.

కిరణ్మయి ఆసుపత్రికి రాగా ఆమెను పరిశీలించిన డాక్టర్ విద్యా భార్గవి పలు పరీక్షలు చేయించి మందులు రాసిందన్నారు.అయితే మందులు రాసిన తదుపరి అన్ని రిపోర్టులు, డాక్టర్ రాసిన ప్రెస్క్రిప్షన్ ను తెలిసిన వేరే డాక్టర్లకు వాట్సాప్ ద్వారా పంపగా పిండం బాగానే ఉందని, కానీ ఆరు నెలల గర్భం చిద్రం చేసేందుకు మందులు ఇచ్చారని తెలపడంతో ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

ఇదే విషయంపై సదరు డాక్టర్ ని ప్రశ్నించగా మానవులు అన్నప్పుడు సహజంగా తప్పులు జరుగుతుంటాయని తనను తాను సమర్ధించుకుందన్నారు. అలాగే ఏదైనా ఉంటే లీగల్‌గా చూసుకుంటానని చెప్పిందన్నారు. తదుపరి స్థానిక పోలీసులకు, జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కాగా డాక్టర్ విద్యాభార్గవి నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తూనే ప్రైవేట్ గా ప్రకాశం బజార్‌లో ఆసుపత్రిని నిర్వహిస్తుందని ఈ సంఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.