18 March, 2026 | 2:47 AM

వందేమాతర గీతానికి ఇదేం అవమానం! కాంగ్రెస్ మౌనమేల?

18-03-2026 01:05 AM

అసెంబ్లీలో వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): వందేమాతరాన్ని అవమాని స్తుంటే కాంగ్రెస్ మౌనమెందుకు వహి ంచింది?, సోమవారం అసెంబ్లీలో వందేమాతరం గీతాలాపన జరుగుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారని, దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మండిప డ్డారు. వందేమాతరం గీతం దేశ స్వాతంత్ర పోరాటానికి ఊపిరని, దాన్ని అవమానిస్తే కాంగ్రెస్‌కు నోరు రాదా? అని ప్రశ్నించారు.

తాము చిన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పటి నుండి ఒక నినాదం ఉండేదని.. ‘భారత్ మే రహ నా హోగాతో వందేమాతరం కహనా హోగా’ (భారత్‌లో ఉండాలంటే వందేమాతరం అనాల్సిందే) కానీ, నేడు.. ఈ వందేమాతరాన్ని అవమానపరిచిన మజ్లిస్ పార్టీ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటి?  అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో.. ఉప్పల్, మల్కాజ్‌గిరి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో ఒక ఎంపీ జై పాలస్తీనా అంటే చప్పట్లు కొట్టిన కాంగ్రెస్.. భారత్ మాతాకీ జై అనడానికి సిగ్గుపడుతోందని, ఇది పరాకాష్టకు చేరిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయమన్నారు.

‘రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతారు కదా.. ఆయనకు ఒక్కసారి ఆర్టికల్ 51 చదవమని చెప్పండి, అప్పుడు అసలు విషయం ఆయనకు తెలుస్తుంది’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. మజ్లిస్ పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అది వారి రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 కింద ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక ధర్మాలు, విధులు ఉంటాయని, కానీ మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. 

అది ఒక పక్షపాత సంస్థ..

ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, అమెరికాకు చెందిన యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అనే సంస్థ రిపోర్టును పట్టుకుని కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. అదే సంస్థ మన దేశ గూఢచారి సంస్థ ‘రా’ని కూడా బ్యాన్ చేయాలని రికమెండ్ చేసిందని, మరి ఆర్‌ఎస్‌ఎస్‌ని బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీ.. మన దేశ రక్షణ సంస్థ అయిన ‘రా’ని కూడా రద్దు చేయమంటుందా? జవాబు చెప్పాలన్నారు.

ఆ సంస్థ ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపుతో చూస్తుందని, ఇది ఒక పక్షపాత సంస్థ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024లోనే స్పష్టం చేసిందన్నారు. లష్కరే తోయిబా కంటే హిందూ గ్రూపులే ప్రమాదకరమని ఆ రిపోర్ట్ చెబితే, కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తోందని, అంటే కాంగ్రెస్, లష్కరే తోయిబాకు సపోర్ట్ చేస్తున్నదా? అని ప్రశ్నించారు.

తలా తోక లేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ వైఖరిని తాము ఖండిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని, 60 సంవత్సరాల వారి పాలనను ప్రజలు చూశారు కాబట్టే వాళ్లను పక్కన పెట్టారన్నారు. అది తట్టుకోలేకపనే ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గ్యాస్  విషయంలో అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తున్నారని విమర్శించారు. 

బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ..

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని, గతంలో 12 స్థానాలు ఉంటే, ఇప్పుడు 22 సీట్లను గెలుచుకోవడం బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడం మాకందరికీ గర్వకారణమన్నారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా ఎన్నికైనందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.