23 June, 2026 | 2:31 AM

కాళేశ్వరం దోపిడీపై చర్యలేవి?

15-06-2024 12:21 AM

హరీశ్, కేటీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి రాజీపడ్డారా?  

క్షీరసాగర్ దళితుల భూములు 30 రోజుల్లో తిరిగి ఇవ్వాలి

లేకపోతే నక్సలైట్ల మాదిరిగా జెండాలు పాతుతాం

మంత్రి పొంగులేటికి దమ్ముంటే వెంకట్రామిరెడ్డి భూములపై విచారణ జరిపించాలి 

విజయోత్సవ సభలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

సిద్దిపేట, జూన్ 14 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకున్న కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ కట్టబెట్టిన వారు (మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి) స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి వారిని అరెస్టు చేయడం లేదని.. వాళ్లతో రాజీపడ్డావా లేక భయపడుతున్నావా అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గాంగడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రఘునందన్ రావు మాట్లాడారు.

దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో పుష్పరాజ్ సంస్థ నుంచి డబ్బులు తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేసినట్లు డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన్వడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ కెమెరాలు ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. ఇద్దరూ కలిసిపోయారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని, అందుకు సుల్తానాబాద్‌లో బాలికపై జరిగిన హత్యాచారమే రుజువని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారులు బీఆర్‌ఎస్ పార్టీలో ఒక్కరూ లేరని, మితిమీరిన అహంకారంతోనే బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని విమర్శించారు. కోమటోళ్లకు రాజకీయాలు ఎందుకు, వ్యాపారం చేసుకోవాలంటూ హరీశ్ రావు హేళన చేశారని.. అందుకే హరీశ్ రావు అడ్డా అని చెప్పుకునే సిద్దిపేటలో కమలం వికసించిందని చెప్పారు. సిద్దిపేటలో హరీశ్ రావు ఆగడాలకు ఇబ్బందిపడని వర్గం లేదని, చివరికి దళిత బంధు ఇవ్వమంటూ బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. ఇక నుంచి హరీశ్ రావు దుకాణం బంద్ అయిందంటూ వ్యాఖ్యానించారు.

వెంకట్రామి రెడ్డి ఖాన్ కోల్ కే సునో.. 

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి జర ఖాన్ కోల్ కే సునో(చెవులు నిక్కరించి విను).. 30 రోజుల సమయం ఇస్తున్నా.. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారంతో గుంజుకున్న దళితుల భూములను తిరిగి వాళ్లకు ఇవ్వకపోతే ఎనకట నక్సలైట్లు భూముల్లో జెండాలు ఎట్లా పాతారో మేము కూడా ఆ భూముల్లో జెండాలు పాతుతామని రఘునందన్ రావు హెచ్చరించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలోని క్షిరాసాగర్‌లో దళితుల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌమ్ హౌజ్ నిర్మించుకొని అనేక ఆక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. దమ్ముంటే వెంకట్రామిరెడ్డి భూములపై విచారణ జరిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. 

5 వేల ఎకరాల భూమి ఏమైంది

610 జీవో అమలు చేస్తే మాజీ మంత్రి హరీశ్ రావు స్థానికేతరుడు అవుతాడని, దానిని కాపాడుకునేందుకు బెజ్జేంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారని రఘునందన్ రావు అన్నారు. హరీశ్ రావు సొంత గ్రామం తోటపల్లిలో  రిజర్వాయర్ పేరిట 5 వేల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకొని రైతులను దినసరి కూలీలుగా మార్చారని ఆరోపించారు. ఆ భూమి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి వెంటనే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

నా గెలుపు మల్లారెడ్డికి అంకితం

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో సర్వం కోల్పోయిన భూ బాధితులకు న్యాయం చేయలేదని, ఆ పాపం మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తగులుతుందని అన్నారు. మల్లారెడ్డి అనే వ్యక్తి తాను నిర్మించుకున్న ఇంటి దూలాలు, వాసాలు, మోగురాలతో చితి పేర్చుకొని తానే స్వయంగా నిప్పు పెట్టుకొని ప్రాణాలు అర్పించి ముంపు బాధితుల బాధను వ్యక్తం చేసినా అప్పటి ప్రభుత్వం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన గెలుపును మల్లారెడ్డికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు. సభలో పార్టీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, విద్యాసాగర్ రావు, భూపతి, శంకర్, కనకయ్య, వీరేశం, రాజు, సంతోశ్, బాలేశ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.