ఐసెట్‌లో 91.92% ఉత్తీర్ణత
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొ.ఆర్. లింబాద్రి, కాకతీయ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.92 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 77,942 మంది పరీక్షకు హాజరుకాగా, 71,647 (91.92 శాతం) మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 36,806 మంది పరీక్షకు హాజరైతే 33,928 (92.18 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక అమ్మాయిలు 41,135 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 37,718 (91.69 శాతం) మంది అర్హత సాధించారు. మొదటి ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మునీబుల్లా హుస్సేన్, రెండో ర్యాంకును జెల్ల భరత్, మూడో ర్యాంకును కందాల లాస్య, నాల్గో ర్యాంకును పలగుల్ల రిషిక రెడ్డి, కె.శివకుమార్ సాధించారు. ఈనెల 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సెట్‌లో అందుబా టు లో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్లు వెంకట రమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ ప్రొ.ఎస్.నర్సింహాచారి తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
336 కాలేజీల్లో 42 వేల సీట్లు..
రాష్ట్రంలో మొత్తం 336 కాలేజీలు ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు. వీటిలో 272 ఎంబీఏ, 64 ఎంసీఏ కళాశాలలున్నాయన్నారు. 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లుండగా, 64 ఎంసీఏ కాలేజీల్లో 6,990 సీట్లున్నాయని ఆయన తెలిపారు. ఐసెట్‌కు గతేడాదిలో 75,920 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 86,156 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.






