23 June, 2026 | 3:50 AM

గుడిసెల కూల్చివేతకు అధికారుల యత్నం

15-06-2024 12:19 AM
  1. అడ్డుకున్న పేదలు, సీపీఐ నాయకులు
  2. సీఎంతో చర్చించిన తర్వాత సమాధానం ఇస్తామన్న నాయకులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 14 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గామ రెవెన్యూ పరిధిలోని రావినారాయణ రెడ్డి కాలనీ ఫేస్-2 సర్వే నెంబర్ 221లో దాదాపు 100 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఇక్కడ సుమారు 40వేల మంది 4 వేల గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. గురువారం కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ రవీందర్ దత్తు, హయత్‌నగర్ సీఐ రామకృష్ణ గుడిసెలు వేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయాలని లేదంటే తొలిగిస్త్తామని పేదలను హెచ్చరించి, వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఎమ్మార్వో, హయత్‌నగర్ సీఐ రామకృష్ణ అక్కడకు వెళ్లి గుడిసెలు ఖాళీ చేయాలని ఆదేశించారు.

పేదవాళ్లమైన తమకు ఉండడానికి స్థలం లేదని, స్థలం చూపిస్తే ఖాళీ చేస్తామని, అప్పటివరకు ఖాళీ చేయబోమని పేదలు బదులిచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఉన్న సీపీఐ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మారో రవీందర్ దత్తు మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలతోనే గుడిసెలను తొలిగించేందుకు వచ్చామన్నారు. గతంలోనే  నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు.

అనంతరం సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. కొందరు అక్రమార్కులు 58, 59 జీవోలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను అక్రమించుకున్నారని, ముందుగా వారిపై చర్యలు తీసుకున్న తర్వాత ఇక్కడి రావాలని సవాల్ చేశారు. కబ్జాదారులను ఏమీ చేయలేని అధికారులు పేదలను బెదిరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని, సీఎం సూచనల తర్వాత తమ కార్యాచరణ వివరిస్తామని అధికారులకు నచ్చచెప్పారు. పది రోజుల గడువు ఇస్తున్నాని అప్పటిలోగా సమాధానం చెప్పాలని సూచించి అధికారులు వెళ్లిపోయారు. 

గురువారం రాత్రి నుంచి హై టెన్షన్

రావినారాణరెడ్డి కాలనీ ఫేస్‌ గుడిసెలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో గురువారం ర్రాతి నుంచి హై టెన్షన్ మొదలైంది. గుడిసెలు తొలగించడానికి జేసీబీలు, ఇనుప రాడ్‌లతోపాటు భారీ ఎత్తున పోలీసు బలగాలతో అధికారులు అక్కడ మోహరించారు.  అర్ధరాత్రి డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తూ పరిస్థితులను గమనించారు. ఆ విషయాన్ని పసిగట్టిన పేదలు సీపీఐ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు భారీ ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుడిసెలు కూల్చుతున్నారని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సైతం అక్కడి వెళ్లారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లి, శుక్రవారం ఉదయం మళ్లీ వచ్చారు.  సీపీఐ నాయకుల జోక్యంతో తిరిగి వెళ్లిపోయారు.