05-07-2025 12:00:00 AM
కరీంనగర్ సిరిసిల్ల వెళ్లే ప్రయాణీకుల తీవ్ర అవస్థలు
అటుగా వెళుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు దుస్థితిపై ఆరా
గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయిన స్థానికులు, వాహనదారులు
వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి
తక్షణమే రహదారిని బాగుచేయాలని ఆదేశం
కరీంనగర్, జూలై 4(విజయక్రాంతి): అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ నుండి సిరిసిల్ల జిల్లాకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గమధ్యలో బావూపేట రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లుం డటాన్ని చూసి బండి దిగారు. ఆ నీటిలో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను, ప్రయాణీకులను చూశారు.
కేంద్ర మంత్రి ఆగడంతో స్థానికులు ఆయన వద్దకు రావడంతో ఈ నీళ్లు ఎప్పటి నుండి ఉన్నాయి? అధికారుల ద్రుష్టికి తీసుకురాలేదా? అని అడిగారు. గత 15 రోజులుగా రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉన్నాయని, అధికారుల ద్రుష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. ఈ నీటిలో ప్రయాణం చేయడంవల్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోందని, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.
నిన్ననే మూడు ఆటోలు బోల్తా పడ్డాయని, అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం వాన కురిసినా ఈ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉంటున్నాయని చెప్పారు.ఇంత జరుగుతున్నా తన ద్రుష్టికి ఎందుకు తీసుకురాలేదని, స్థానిక నేతలు అధికారులపై ఎందుకు ఒత్తిడి తేలేదని అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆర్ అండ్ బి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తగిన నిధులు లేవని జవాబివ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి తక్షణమే బావూపేట రహదారిని బాగు చేయాలని, ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బంది రాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ మేరకు చర్యలు తీసుకుంటాననిపేర్కొన్నారు.