07-04-2025 12:00:00 AM
అంతటా ఉంటాడనే వాడు
ఎక్కడ కనిపించనట్లే
అంతట ఆమే ఉన్నా
కనుగొనలేని గుడ్డితనం
ఈ దేశానిది!
పంచభూతాల వలె
అన్ని ఎదుగుదలలకు
ఆమే కారణభూతమైనా
కీర్తిని పంచలేని పిసినారి తనం
ఈ దేశానిది
కళ్ళముందే
పురుడుబోసిన ప్రపంచం
ఎదుగుదల ఎంతున్నా
మూలాన్ని స్మరించని
కృతఘ్న దేశమిది!
అడిగింది తేలేదనో
ఎంతో ఇష్టమంటే
పట్టించుకోలేదనో
అతన్ని ప్రేమించానంటే చాలు
ప్రాణాలు గాలిలో
కలుపుతున్న దేశమిది!
గడప దాటని స్వేచ్ఛకూడా
నిబంధనల మధ్య కునారిల్లుతున్నా
ఆమె వెనుకబాటుతనం
లోకానికి చేటన్నా
కళ్ళు తెరవని దేశమిది!
మీసాలు మెలేస్తున్న దేశం
విశ్వగురుడనని
బతుకీడుస్తున్న దేశం
ఇంకా ఎన్నాళ్లీ దేశం
పాలు తాగిన
రొమ్మును గుద్దుతుందో!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి