07-04-2025 12:00:00 AM
నేను ఒడ్డున నిలిచినప్పుడు
సముద్రం నాతో మాట్లాడింది.
అది అలల ఊరేగింపుతో
ఎదురు వచ్చింది
దాని మృదువైన
నీటి తుంపరులు,
నా పాదాలను తాకి,
మళ్లీ వెనక్కి మరలింది
ఏదో మరచిపోయినట్లు
హడావుడిగా
అది నా పాదాలను
అల్లుకు పోయినప్పుడు
చిన్నారి మారం చేసినట్లుగా వుంది
వెనక్కి ముందుకు పరుగెడుతూ
నా బాల్యం నాకు గుర్తు చేసింది.
దాని అల్లరిలో ఎనెన్నో రహస్యాల
దాగుడు మూతలాటలున్నాయి.
అమ్మ పాడినంత తియ్యగా
ఇది ఓ మధురమైన జోలపాట.
మళ్లీ వెనక్కి వచ్చింది,
అలల స్వరాలను మీటుతూ
నా పాదాలను ముద్దాడుతూ,
మురిపిస్తూ.
దాని అంతరంగపు భాషను
అనువదించలేకపోయాను
ఐనా, దానిని చదవడానికి
ప్రయత్నిస్తున్నాను.
అలసట లేని ఆ కేరింతల
కోలాహలం
ప్రతి చూపు కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తుంది
దగా పడిన పీడిత దృష్టికి
దాని సందడి ఒక ఉద్యమసెగలా వుంటుంది
కుర్రకారు భవిష్యత్త్
ఆలోచనల రాపిడి
ఎగసి పడుతున్న అలల హోరు
అది వెక్కిరింతల ఘోష
ఎంత మాత్రం కాదు.
ఓటమితో రగిలిన గాయాలు
నీ గమ్యం చూపించే దీపాలు!
- బొల్లిముంత వెంకటరమణారావు