భవిష్యత్‌లో అంటే..?

16-09-2026 | 05:25am

అధికార కాంగ్రెస్‌లోబీసీ సీఎం చర్చ

పీసీసీ చీఫ్ ప్రకటనతో మరింత గందరగోళం

20౩2వరకు నేనే సీఎం అంటున్న రేవంత్‌రెడ్డి

పరస్పర విరుద్ధ ప్రకటనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో బీసీవాదం బలంగా వినిపిస్తున్న సమయంలో.. ముఖ్యమంత్రి పదవి(Chief Minister post)t విషయంలో అధికార కాంగ్రెస్‌లో(ruling Congress) భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) ప్రకటనలు పరస్ప రం విరుద్ధ్దంగా ఉంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పటినుంచే ఎవరికి వారుగా జోస్యం చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం 2032 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఘంటాపథంగా చెబుతున్నారు. పలు బహిరంగ సభల్లోనూ బాహటంగానే ఈ విష యం ప్రకటించుకుంటున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాత్రం సీఎం పదవి విషయంలో పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే.. భవిష్యత్తులో బీసీవర్గాల నుంచే ముఖ్యమంత్రి అవుతారని పలు సందర్భాల్లో స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు..

కాంగ్రెస్ పార్టీ నుంచి ఓసీల్లోని రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, వెలమ సామాజికవర్గాలతో పాటు ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం పీఠంలో కూర్చున్నారని, బీసీలకు సీఎం అయ్యే యోగ్యం రాలేదని మహేష్‌కుమార్‌గౌడ్  పలు సందర్భాల్లోనూ గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో బీసీ సీఎం అంటే ఎప్పు డు..? అనే అంశం పైనే ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎన్ని టర్మ్‌లు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. భవిష్యత్ అంటే, ఎన్నో టర్మ్‌లో కాంగ్రెస్ నుంచి బీసీ నాయకునికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు.. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పదవుల విషయంలో మొదటినుంచి తీవ్ర అన్యాయమే జరుగుతుందనే ఆవేదన ఆ వర్గా ల్లో నెలకొన్నది. ప్రధానంగా సామాజిక న్యాయానికి పెద్దపీఠ వేస్తామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నదనే వాదన మొదటినుంచి వినిపిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో పీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కట్టబెట్టి.. ఆ తర్వాత  అధికారంలోకి వచ్చాక ఆ బీసీ వర్గాలను విస్మరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.

అంటే పార్టీ కష్టకాలంలో ఉంటే బీసీల ఓటు బ్యాంకు కోసం.. బీసీ నాయకత్వం గుర్తుకు వస్తుందని, అధికారంలోకి వచ్చాక జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు పక్కనపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఉండగా, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కొనసాగుతున్నారు. గతంలో వైఎస్, డీఎస్ జోడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు తనతో పాటు మహేష్‌కుమార్‌గౌడ్ సారథ్యంలో మరోసారి హస్తం పార్టీ అధికారంలో వస్తుందని, మరోసారి తానే సీఎం అవుతానని రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీసీ వర్గాలు కష్టపడితే.. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం పీఠంపై కూర్చుంటారా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీఎం పదవికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ సొంత పార్టీతో పాటు బీసీ సంఘాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో బీసీవాదం బలంగా వినిపిస్తోందని, బీసీవర్గాల ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. మరో రెండేన్నరేళ్ల వరకు వేచి చూడాల్సిందేని రాజకీయవర్గాలు అంటున్నాయి.   

మరిన్ని వార్తలు