అసెంబ్లీ వద్ద ఏం జరిగింది?

16-09-2026 | 05:15am
  1. కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల ప్రశ్నల వర్షం
  2. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
  4. సైఫాబాద్ పీఎస్ పరిణామాలపై రాజకీయ సెగ!

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): అసెంబ్లీ గేట్(Assembly Gate)-3 వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ, తోపులాట ఘటనపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. పోలీసుల నోటీసుల(Police notices) మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పీఏ మహేందర్‌రెడ్డి(PA Mahender Reddy), పీఆర్వో మహేశ్(PRO Mahesh) సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అసెంబ్లీ వద్ద ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట వెనుక ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయమని ఎవరైనా ఆదేశించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీశారు. విచారణలో భాగంగా బాధితులను అసెంబ్లీ గేట్ వద్దకు తీసుకెళ్లి ’సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, బీఆర్‌ఎస్ లాయర్లు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

ముందస్తు నోటీసు లేకుండా ఇలా చేయడం హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేశారు. కాగా విచారణ పేరుతో పిలిపించి మఫ్టీ పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలతో స్టేషన్‌లోనే దాడి చేయించారని కేటీర్ ఆరోపించారు. దీని వెనుక సీఎం రేవంత్‌రెడ్డి హస్తముందని, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని డిమాండ్ చేశారు.

దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి: హరీశ్‌రావు

పండుగ రోజున విచారణకు పిలిపించి 15 మంది ముసుగుధారులతో విచారణ గదిలో దాడికి యత్నించారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. లీగల్ టీమ్ కేకలు వేయడంతో వారు పరారయ్యారని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఎస్సై సమక్షంలోనే 30 మంది మాస్కులు ధరించి స్టేషన్ లోపలే దాడికి తెగబడ్డారని, ముందస్తు కోర్టు ఆదేశాలను పోలీసులు దిక్కరిస్తున్నారని లక్ష్మణ్ (బీఆర్‌ఎస్ లీగల్ సెల్) మండిపడ్డారు.

ఎలాంటి దాడి జరగలేదు: డీసీపీ శిల్పవల్లి

స్టేషన్‌లో ఎలాంటి భౌతిక దాడి జరగలేదని, ప్రచారం అవాస్తవమని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. గణేష్ డీజే పర్మిషన్ కోసం వచ్చిన కొందరు యువకులు అక్కడున్న వీళ్లతో వాగ్వాదానికి దిగితే వెంటనే వారిని పంపించివేశామని, సీసీటీవీలో దృశ్యాలు భద్రంగా ఉన్నాయని తెలిపారు. కాగా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తుండగా, చట్టప్రకారమే దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ వరుస పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి.

మరిన్ని వార్తలు