5 May, 2026 | 12:30 PM

ఈ నగరానికి ఏమైంది?

24-06-2024 02:58 AM
  • చెత్త నిర్వహణపై చేతులెత్తేస్తున్న బల్దియా 
  • ప్రతి నెలా 100 కోట్లు కేటాయిస్తున్నా..కనిపించని స్వచ్ఛత

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): శానిటేషన్ నిర్వహణలో దేశంలోని అనేక నగరాలతో పోటీ పడి ప్రతి ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెల్చుకోవడమే కాకుండా, ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త నిల్వలు కన్పిస్తున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్, చెత్త నిల్వలు లేని నగరం కోసం బల్దియా ప్రతి నెలా కోట్లు కుమ్మరిస్తున్నా.. వేల మంది పనిచేస్తున్నా.. చిత్తశుద్ధి లోపంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో గ్రేటర్‌లో ఏ రహదారిలో పయనించినా చెత్త నుంచి వెదజల్లే దుర్వాసన భరించలేక వాహనదారులు, పాద చారులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో పాలక మండలి తీరును ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. 

నగరానికి 5 స్టార్ రేటింగ్.. 

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా క్లీన్ సిటీ విభాగంలో ప్రతి ఏడాది హైదరాబాద్ నగరానికి అవార్డులు దక్కుతున్నాయి. 2016లో 73 సిటీలలో 19వ ర్యాంక్, 2017లో 434 సిటీలలో 22వ ర్యాంకు, 2019లో 4,273 నగరాలలో 35వ ర్యాంకును జీహెచ్‌ఎంసీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, 2020లో బెస్ట్ మెగాసిటీగా, 2021లో బెస్ట్ సెల్ఫ్ సస్టెయినబుల్ మెగాసిటీగా, 3 స్టార్ రేటింగ్‌తో పాటు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌ను సొంతం చేసుకుంది. 2022లో మరోసారి 3 స్టార్ రేటింగ్‌తో పాటు 10 లక్షల జనాభా విభాగంలో 10వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.

2023లో 5 స్టార్ రేటింగ్‌తో పాటు ఇండియాలో 9వ క్లీన్ సిటీగా అవార్డును గెల్చుకుంది. అయితే, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేపడుతున్న సమయంలోనే అధికారులు హడావుడి చేసి నగర పరిసరాలను క్లీన్‌గా ఉంచి తెల్లని ముగ్గులు చల్లుతూ అవార్డులను గెల్చుకుంటున్నట్టుగా పలువురు విమర్శిస్తున్నారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల అనంతరం నగరంలో స్వచ్ఛత, శుభ్రత, పౌరుల ఆరోగ్యాన్ని బల్దియా పాలక మండలి గాలికి వదిలేస్తున్నట్టుగా సామాజిక కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. అయితే, స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో 5 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఏమైంది అంటూ పౌరులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

ప్రతి నెలా రూ. 100 కోట్ల ఖర్చు.. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లు పనిచేస్తున్నాయి. శానిటేషన్ విభాగంలో క్షేత్రస్థాయిలో దాదాపు 18 వేల మంది సిబ్బంది, ఎస్‌ఎఫ్‌ఏలు, సర్కిల్ స్థాయిలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంవోహెచ్), డిప్యూటీ కమిషనర్లు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లు, మొత్తం నిర్వహణను పర్యవేక్షణ చేసేందుకు అడిషనల్ కమిషనర్లు, కమిషనర్ పనిచేస్తుంటారు. ఇంకా ట్రాన్స్‌పోర్ట్, సీఎన్‌డీ, ఎస్‌డబ్ల్యూఎం తదితర విభాగాలున్నాయి. జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పాలక మండలిలో భాగస్వామ్యంగా ఉన్నారు.

గ్రేటర్‌లో ప్రతిరోజూ 7,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ. 2,281 చొప్పున రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. ఈ ప్రకారం బల్దియాలో 90 శాతం చెత్త నిర్వహణ చేపడుతున్న రాంకీ సంస్థకు ప్రతినెలా రూ.51 కోట్లను, గ్రేటర్‌లో 18 వేల మంది శానిటేషన్ వర్కర్లకు ప్రతినెలా రూ.31 కోట్లను, స్వచ్ఛ ఆటోల ఈఎంఐకు బల్దియా ప్రతినెలా చెల్లింపులు చేస్తోంది. వీటితో పాటు జీహెచ్ ఎంసీలో శానిటేషన్ విభాగంలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి దాకా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే ప్రతి నెలా వేతనాలను కలుపుకొంటే దాదాపు నెలకు రూ. 100 కోట్లకు తక్కువేం కాదు.

చేతులెత్తేస్తున్న బల్దియా..

జీహెచ్‌ఎంసీలో శానిటేషన్ విభాగానిది చిత్రమైన పరిస్థితి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే పని మాత్ర మే జీహెచ్‌ఎంసీ చేస్తుంది. మొత్తం చెత్త నిర్వహణలో ఈ పని కేవలం 10 శాతం మాత్రమే. మిగతా 90 శాతం రాంకీ సంస్థనే చేయాల్సి ఉంది. అంటే బిన్స్, వీధుల వెంట రోడ్డుపై ఉండే చెత్త నిల్వలు, శానిటేషన్ వర్కర్లు రోడ్లను ఊడ్చేది, ఫంక్ష న్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్ తదితర నగరంలో రోడ్డుపై ఎక్కడ చెత్త కన్పించినా రాంకీ సంస్థనే తొలగించాల్సి ఉంటుంది.

దీంతో పాటు ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి ట్రీట్‌మెంట్ ప్లాంట్ దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా రాంకీ సంస్థ మాత్రమే చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త కన్పిస్తున్నా బల్దియా అధికారులు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టని రాంకీ సంస్థను ప్రశ్నించే వారే కరువయ్యారు.