14 July, 2026 | 6:14 PM

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు

24-06-2024 02:53 AM
  • అదే సమయంలో తిరిగొచ్చిన వ్యక్తి  
  • ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు 
  • చనిపోయింది తమ వాడు కాదని తేలడంతో మృతదేహం పోలీసులకు అప్పగింత 

వికారాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రాణాలతో తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లాలో చోటుచేసు కున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలం నవాంది గ్రామానికి చెందిన సుతెల్లి ఎల్లప్ప (35) కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన అజయ్ ప్రసాద్ అనే వ్యక్తి వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో ఇటీవల పనిలో నుంచి తొలగించారు. దీంతో ఎల్లప్ప కొన్ని రోజులుగా తాండూరు, వికారాబాద్‌లో అడ్డా మీదికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో రెండు మూడు రోజులకొకసారి ఇంటికి వచ్చేవాడు. శనివారం వికారాబాద్‌కు వెళ్లిన ఎల్లప్ప పగలం తా పనిచేసి రాత్రి రైల్వే స్టేషన్‌లోనే నిద్రపోయాడు. రాత్రి 10 గంటల  సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎల్లప్ప వద్ద ఉన్న సెల్‌ఫోన్, కొంత నగదు దోచుకొని రైల్వే ట్రాక్ దాటి పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన రైలు ఢీకొని శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతిచెందిన వ్యక్తి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా ఎల్లప్ప రైలు ప్రమాదంలో మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం వికారాబాద్‌కు వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. సాయం త్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఎల్లప్ప గ్రామానికి వెళ్లడంతో గ్రామస్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అప్పటికే మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబ సభ్యుల కు  సమాచారం ఇచ్చారు. దీంతో వారు అంత్యక్రియలు నిలిపివేశారు. బతికి వచ్చిన ఎల్లప్పను చూసి కుటుంబీకులు బోరున విలపించారు. ఈ విషయాన్ని వికారాబాద్ రైల్వే పోలీసులకు తెలిపారు. దీంతో కంగుతిన్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆదివారం రాత్రి తిరిగి వికారాబాద్‌కు తీసుకెళ్లారు. మృతిచెందిన వ్యక్తి ఎవరనే విషయం తెలుసుకోవాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.