8 May, 2026 | 12:11 AM

అమెరికా భవితవ్యం ఏమిటి?

21-05-2024 12:05 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్ని నెలల్లో ఉండగా ప్రధాన పార్టీలు డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీలలో ఎన్నికల వేడి మొదలయింది. గెలుపుపై  ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి దేశమూ ‘అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా?’ అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 

నాలుగేళ్ల బైడెన్ పరిపాలన సవ్యంగానే ఉంది. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం లో కొంచెం ఆలస్యం జరిగినా మెరుగైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. ఏ దేశ అధ్యక్షుడైనా దేశహితం కోసమే పనిచేస్తారు. ఆయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాటలలో ఓ భయానక వార్త అమెరికాను, మిగతా దేశాలను నివ్వెర పరచింది. అదేమిటంటే, మూడవ ప్రపంచ యుద్ధం మరో అయిదారు నెలలలో రావచ్చన్నది. ట్రంప్ దేన్ని ఊహించి ఈ మాట అన్నాడో అర్థం కాదు.

మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే అప్పుడు అమెరికా ఎన్నికలకు ఆటంకం కదా! ఒకవేళ ఎన్నికలు అయిపోయిన తరువాత మూడవ ప్రపంచ యుద్ధం వస్తే, అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా చూస్తూ ఊరుకోరు. శాంతికి తప్పక ప్రయత్నిస్తారు. యుద్ధం నిలువరించడమే పాలకుల లక్ష్యం కావాలి. అంతేకాని, ఇటువంటి ఆందోళన కలిగించే మాటలు కాదు. ‘నేను అధికారంలో ఉంటే అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదు, పశ్చిమ ఆసియా యుద్ధం కూడా జరిగి ఉండేది కాదు’ అని ట్రంప్ చెప్పడం మంచిదే. ఎవరైనా యుద్ధాలు కోరుకోరు. ట్రంప్ చెప్పిన మాటలలో ఒకటి నిజం. అదేమిటంటే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఆయుధ శక్తి పెను నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు అన్ని దేశాలు తగిన అణు సామర్థ్యం కలిగి ఉన్నాయి.

‘ప్రధాన ప్రత్యర్థులు ట్రంప్, బైడెన్‌లలో ఎవరు మేలు?’ అనే విషయానికి వస్తే ఇద్దరూ సరైన వాళ్ళే. కాకపోతే, విదేశీ సంబంధాలు మెరుగు పరచుకోవాలి. విదేశీయుల హక్కులను గౌరవించాలి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయుల పట్ల కఠిన చట్టాలు తేకూడదని మన ఆకాంక్ష. ప్రస్తుతం అగ్రదేశం అమెరికాకు వచ్చిన నష్టం ఏమి లేదు. సుస్థిరత, అభివృద్దే అమెరికా లక్ష్యం. భద్రత విషయంలో అమెరికా తరువాతనే ఏ దేశమైనా. ఒడుదొడుకులు ఎదురయినా, అవి తాత్కాలికమే. మళ్ళీ అభివృద్ధి బాట పట్టాల్సిందే. రిపబ్లికన్స్, డెమోక్రటిక్స్ నాయకులలో ఎవరు అధికారంలోకి వచ్చినా అన్ని దేశాలపట్ల సఖ్యత, సహకారంతో ముందుకు సాగుతారని ఆశిద్దాం.

 కనుమ ఎల్లారెడ్డి