8 May, 2026 | 1:05 AM

ఇరాన్ భవితవ్యం?

21-05-2024 12:00 AM

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో రెండు డ్యామ్‌లను ప్రారంభించిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరికొందరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇలా పలు అంశాలు ఏకకాలంలో తెరమీదికి వచ్చిన వేళ ఈ ప్రమాదం జరగడం టెహ్రాన్‌ను ఆందోళనకు గురి చేసింది.

అయితే, రైసీ మృతి వార్త ధ్రువీకరణ కాకముందే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్స్ వేదికగా ఇరాన్ ప్రజలకు సందేశమిస్తూ, దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిపాలన యథావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కాగా, రైసీ మృతితో ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ వైస్‌ప్రెసిడెంట్ మహమ్మద్ మొఖ్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. దీనికి ఖమేనీ ఆమోదముద్ర కూడా లభించింది. అనంతరం 50 రోజుల్లో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా రాజ్యాంగం ప్రకారం జరిగే ప్రక్రియ.

అయితే, ఇరాన్‌లో బలమైన నేతగా గుర్తింపు పొందిన రైసీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? కొత్త అధ్యక్షుడి తర్వాత ఇరాన్ విధానాల్లో ఏమయినా మార్పులు వస్తాయా?  ఇలాంటి అనేక ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతున్నాయి. దీనికి సమాధానం లభించాలంటే రైసీ జీవితం గురించి తెలియాలి. ఇరాన్‌లో బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన రైసీ 15వ ఏట క్వామ్‌లో మతవిద్యను అభ్యసించారు. 20వ ఏట ప్రాసిక్యూటర్‌గా నియమితుడైన రైసీ అత్యంత వేగంగా అధ్యక్షుడి స్థానానికి ఎదిగారు. 1988లో రాజకీయ ఖైదీలకు మరణ శిక్షల అమలును పర్యవేక్షించిన రైసీ ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు.

అమెరికా సైతం ఆయనపై ఆంక్షలు విధించడానికి ఇది కారణమైంది. 1989లో సుప్రీం లీడర్  ఖొమేనీ మరణం తర్వాత ప్రస్తుత లీడర్ ఖమేనీ నీడలో దేశంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రైసీ 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రహౌనీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటినుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు  ఏర్పాట్లు చేసుకున్నారు. 2021లో ఆయన కల నెరవేరి అధ్యక్షుడయ్యారు. 

దివంగత ఖొమైనీ, ప్రస్తుత సుప్రీం లీడర్ ఖమేనీలతో మంచి సంబంధాలున్న రైసీ ఖమేనీకి వారసుడవుతారన్న వార్తలు కూడా బలంగా వినిపించాయి. రెండేళ్ల క్రితం  రైసీ సర్కార్‌పై దేశవ్యాప్తంగా తొలిసారి చెలరేగిన అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. తాను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కోసం చాలామంది అభ్యర్థులపై అనర్హత వేటు వేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే,అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత రైసీ పరపతి బాగా పెరిగింది. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ తరుణంలో ఆయన హఠాన్మరణం ఇరాన్‌కు గట్టి షాకే. మరోవైపు రైసీ మృతిలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  

అయితే, రైసీ మృతి తర్వాత కూడా ఇరాన్ విధానాల్లో ఎలాంటి మార్పులు రాకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. విదేశాంగ విధానంలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్‌తో ఘర్షణ వైఖరి కూడా కొనసాగుతుందంటున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ వ్యతిరేక ముఠాలన్నిటికీ మద్దతుగా ఇరాన్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే, ఈ ప్రాంతంలోని అరబ్ దేశాలతో మైత్రీ సంబంధాలు కూడా కొనసాగుతాయని భావిస్తున్నారు.

కాగా, రైసీ మృతి వార్త తెలియగానే దేశంలోను, బయటి దేశాల్లోను ఆయనను వ్యతిరేకించే ఇరానియన్లు బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరోవైపు  రైసీ మృతితో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, చమురు ధరలు భారీగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.