శాంతిమార్గం బోధించిన బుద్ధుడు
వెయ్యి పనికి రాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే
ఒక్క మంచిమాట మేలు.
ఈ సూక్తి మనం తరచూ వినేది. ఇంత అద్భుతమైన వాక్కు చెప్పింది మరెవరో కాదు, గౌతమ బుద్ధుడు. బౌద్ధధర్మానికి మూలకారకులైన బుద్ధుని జయంతి వైశాఖ పూర్ణిమ. దీనినే ‘మహావైశాఖి’ లేదా ‘బుద్ధ పూర్ణిమ’ అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
బుద్ధుని జీవితంలో ‘వైశాఖ పూర్ణిమ’ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మాయాదేవిలకు వైశాఖ పౌర్ణమి నాడు ‘సిద్ధార్థుడు’ జన్మించాడు. మరో వైశాఖ పౌర్ణమినాడు జ్ఞానోదయం పొం ది ‘బుద్ధుడి’గా మారాడు. వేరొక వైశాఖ పౌర్ణమి నాడు నిర్యాణం చెందాడు. బుద్ధుడు పుట్టగానే తండ్రి శుద్దోధనుడితో చాలామంది జ్యోతిషులు ‘ఈ బాలుడు పేరు పొందిన మహారాజు లేదా సన్యాసి అవుతాడని’ చెప్పారు.
కానీ, ఒక యువ జ్యోతిషుడు మాత్రం ‘ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడు’ అని చెప్పాడట. బుద్ధుని తండ్రి ఈ యువ జ్యోతిషుడి మాటలు పెడ చెవిన పెట్టి, తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏం చేయాలని ఇతర జ్యోతిషులను అడిగాడు. ‘చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది’ అనడంతో, మరణించడం లేదా రోగ గ్రస్థులవ్వడం వంటి సంఘటనలు బుద్ధుని కంట పడకుండాపెంచారు. యుక్తవయసు రాగానే ఇతనికి యశోధరతో వివాహం చేశారు.
సన్యాసిగా మార్చిన నగర సంచారం
బుద్దుడు ఒకనాడు ఈ ప్రపంచం నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి తండ్రి ఆజ్ఞ తీసుకుని నగర సందర్శన చేసాడు. ఆ సమయంలో అతనికి ఒక వృద్దుడు కనిపించాడు. మరొక మారు ఒక రోగి కనిపించాడు. మరొకసారి నగర సందర్శనం చేస్తున్నప్పుడు మరణించిన వ్యక్తి శవం కనిపించింది. ఈ దృశ్యాలన్నీ చూసి అతని మనసు చలించింది. సంసార సుఖం పట్ల విరక్తి చెంది దానిని వదిలి వేయాలని, అమరత్వాన్ని పరిశోధించాలనే సంకల్పంతో అర్ధరాత్రి ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. అనేకమంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరకి 35 సంవత్సరాల వయసులో బోధివృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు.
అప్పుడే బుద్ధుని భార్య యశోధర మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘బుద్ధత్వ ప్రాప్తి’ అంటే బోధిని పొంది బుద్ధుడిగా మారడం. బుద్ధత్వం అనేది జ్ఞానోదయం ద్వారా లభిస్తుంది. ఇది ప్రాపి్ంతచిన తర్వాత, గౌతమ బుద్ధుడు నిరంతరం తన బోధనలను భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అందించాడు. ఆ బోధనలన్నింటినీ అతని శిష్యులు బుద్ధుడి నిర్యాణం తరువాత సేకరించారు. వీటినే ‘తిపిటకాలు’ అంటారు.
ఈ ఉపదేశాలు మత పరమైనవి కావు, ఎంతో అర్ధమంతమైనవి. ‘లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ మార్పు చెందుతుంది. చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దాన్ని ఆమోదించాలి. మంచి, చెడు దేనికీ ప్రతిస్పందించవద్దు’ అని బుద్ధుడు బోధించే వారు. ‘శ రీరానికి మరణం ఒక్కసారి మాత్రమే. కానీ, మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే’ అంటారు. ‘జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం, సంఘం కోసం పోరాడమని’ ప్రబోధించాడు బుద్ధుడు.
బౌద్ధులకు పెద్ద పండగ
వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బుద్ధ విగ్రహానికి పూజలు చేస్తారు. ఈ రోజున మాంసాహారం ముట్టరు. సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. అందరూ కలిసిమెలసి సంతోషంగా ఉంటారు. శుభాకాంక్షలు తెలియ చేసుకుంటారు. వైశాఖ పౌర్ణమినాడు మనమందరం కూడా ఆ బుద్ధదేవుని స్మరించుకుని, కోరికలను జయిద్దాం. మనల్ని మనం సంస్కరించుకుని ‘మానవ సేవలోనే మాధవ సేవ’ను దర్శిస్తూ, జీవితంలో సార్థకతను సాధిద్దాం.
పాలపర్తి సంధ్యారాణి






