5 March, 2026 | 5:39 AM

పక్క పక్కనే మద్యం షాపుల ఏర్పాటులో మతలబేమిటి?

05-03-2026 12:52 AM

పేరుకే రెండు షాపులు ఒకేచోట మద్యం విక్రయాలు 

గణపురం, మార్చి 4 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో పక్కపక్కనే రెండు మద్యం షాపులను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. మండల కేంద్రంలో వివిధ చోట్ల మద్యం షాపులను ఏర్పాటు చేయకుండా, ఒకే చోట రెండు పక్కపక్కనే మద్యం షాపులను రెండింటిని ఏర్పాటు చేయడంలో మతలబు ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారని ఇటీవల గ్రామస్తులు కొందరు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గణపురం మండల కేంద్రానికి రెండు మద్యం షాపులు మంజూరు కాగా రెండు నెలల క్రితం మద్యం షాపు యాజమానులు సిండికేట్ ద్వారా ఒక్కటై ఒక వైన్ షాప్ ద్వారా మద్యం ప్రియులకు మద్యం విక్రయిస్తూ, మరో వైన్ షాప్ ద్వారా గ్రామాల్లో బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మండల కేంద్రంలోని కొత్తపల్లి సమీపంలో రెండు షాపులు ఒకే దగ్గర ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారి పక్కన లారీలు, భారీ వాహనాలు, ద్వి చక్ర వాహనాలు నిలుపుతూ ప్రమాదకరంగా వైన్ షాపుల నిర్వహణ మారిందని ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో రెండు ప్రాంతాల్లో వివిధ చోట్ల మద్యం షాపులు ఏర్పాటు చేయకుండా ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల మద్యం ప్రియులు మూడు కిలోమీటర్లు రావాల్సి వస్తుందని వాపోతున్నారు. వెంటనే ఒకే చోట ఉన్న మద్యం షాపుల్లో ఒకటి మరోచోటికి మార్చాలని, మద్యం ప్రియులు కోరిన బ్రాండ్లు విక్రయించే విధంగా బీర్లు మద్యం అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుతున్నారు