15-02-2026 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు :
తెలంగాణ రాష్ర్టంలో 116 మున్సిపాలిటీలకు, ఏడు మున్సిపల్ కార్పొరే షన్‌లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆ ర్‌ఎస్, బీజేపీలతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు కూడా పోటీపడ్డాయి. కానీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే త్రిముఖ పోటీ కొనసాగింది. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగానే ఉంటాయి.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో, తాజాగా పురపాలక సంస్థల ఎన్నిక ల్లోనే హస్తం పార్టీ మెజార్టీ స్థానాల్లో విజ యం సాధించి అధికారిక హోదాలో తన పట్టును నిలుపుకుంది.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని అధిగమించి మెజార్టీ వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఓటమి నైరా శ్యం నుంచి బీఆర్‌ఎస్ బయటపడకపోవ డం, సమన్వయంతో పని చేయకపోవటం ఆ పార్టీకి కలిసిరాలేదు.
మరోవైపు బీజేపీ కూ డా ఆశించిన స్థాయిలో పుర ఎన్నికల్లో రా ణించకపోవటం, అధికార కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎప్పటిలానే పట్టణాల్లో, నగరాల్లో ఉన్న ప్రజా సమస్యలు ఎన్నికల సందర్భంగా చర్చకు రాకుండా పార్టీలు, నాయకులు వ్యక్తిగత దూషణలతో శృతి మించిన విమర్శలతో విషయాన్ని పక్కదారి పట్టించారు.
మున్సిపాలిటీల్లో హస్తం జోరు..
116 మున్సిపాలిటీల్లో మెజారిటీ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 66 మున్సిపాలిటీల్లో, 13 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు, వడ్డేపల్లి మున్సిపాలి టీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చైర్మన్ పీఠాలు దక్కనున్నాయి. అయితే 36 మున్సిపాలిటీల్లో మాత్రం ఏ పార్టీకి చైర్మన్ పీఠం దక్కించుకునే వార్డులు గెలవకపోవడం వల్ల హాంగ్ ఏర్పడింది. మొత్తం 2,995 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ 1,347 వార్డులు (44.9 శాతం), బీఆర్‌ఎస్ 781 వార్డులు (26 శాతం), బీజేపీ 335 వార్డుల్లో (11.18 శాతం) విజయం సాధించాయి.
ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న 62 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఏకంగా 50 మున్సిపాలి టీల్లో జయకేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ మంచి విజయాన్ని దక్కించుకున్నట్లయింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీ గతంతో పోలిస్తే బాగా పుంజుకోవటం, ప్రభుత్వ వ్యతిరేక ఓ టు బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య చీలిపోవడం తో కాంగ్రెస్‌కు ఆయా జిల్లాల్లోనూ అనుకూల ఫలితాలు వచ్చాయి.
ఇక దక్షిణ తెలం గాణలో కాంగ్రెస్ హవా, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పెంచుకున్నప్పటికీ, బీఆ ర్‌ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్‌కు ధీటుగా నిలబడి 781 మున్సిపల్ వార్డులను గెలుచుకోవడం గులాబీ శ్రేణులకు బలం చేకూర్చినట్లయింది. బీజేపీ అన్ని మున్సిపాలిటీల్లో తన ఖాతా తెరిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వార్డులు గెలుచుకోలేక మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోయింది.మొత్తంగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ అది అద్భుత విజయం కాదు, బీఆర్‌ఎస్ ఓడిపోయింది కానీ అది దారుణ ఓటమి కాదు, బీజేపీ రాణించింది కానీ అంచనాల మేరకు రాణించలేదన్నది గ్రహించాలి.
కనిపించని కారు..
రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లకు జరిగిన పుర ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ ప్రభావం కనిపించింది. రామగుండం, మంచిర్యాల, నల్లగొండ కార్పొరేషన్లను కైవసం చేసుకోవటమే గాక మహబూబ్ నగర్, నిజామా బాద్‌లో ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠాలను కైవసం చేసుకోనుంది. కొత్తగూడెంలో సీపీఐ, కరీంనగర్‌లో బీజేపీ కార్పొరే షన్‌ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి.
గత స్థానిక ఎన్నికల్లో రాష్ర్టంలోని అన్ని కార్పొరేషన్‌లను గెలుచుకున్న బీఆర్‌ఎస్ ఈసారి ఒక్క కార్పొరేషన్‌లో కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ టం, స్వయంగా ముఖ్యమంత్రి ప్రచారం చేయడం, పార్టీ సమన్వయంతో కలిసికట్టు గా ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే 90 శా తం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో సుమారు 45 శాతం మేర ఫలితాలు సాధించింది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ గత ఓటమి నుంచి బయటపడి మంచి విజ యం సాధించాలనుకుంది. ఇక బిజెపి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనుకూలతని కొనసాగించి మున్సిపాలిటీల్లోనూ అదే ఫలితా లను ఆశించినప్పటికీ అనుకూల ఫలితాల ను రాబట్టలేకపోయింది. దీంతో ఆయా పార్టీలు ఫలితాలపై అంతర్మధనం చేసుకుంటున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి అన్నీ తానై ఎన్నికలను నడిపిస్తుంటే, మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు.
అయితే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండడం, పార్టీ సమన్వయంతో గెలవాలనే పట్టుదలతో పని చేయలేదన్న అసంతృప్తి బీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఒక దశాబ్దం పాటు తెలంగాణను ఏలిన బీఆర్‌ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవకపోవడం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి సొంత డివిజన్‌లో ఆ పార్టీ ఓడిపోవడం, కోస్గి లాంటి మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులను, ధర్మపురిలో మొత్తం 15 వార్డులను కాంగ్రెస్ గెలుపొందటం, ఖమ్మంలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఎన్నికల్లో కొస మెరుపు. దాదా పు 79 మున్సిపాలిటీల్లో, 5 కార్పొరేషన్లలో పాగా వేస్తూ కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల తరువాత మరొకసారి తన ఆధిక్యతను నిలబెట్టుకోవడంతో రేవంత్ నాయకత్వం మరిం త బలపడిందని చెప్పొచ్చు.
సీఎం ధీమా ఏమిటి?
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ 2034 వరకూ అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. తాజాగా ఒక అడుగు ముందుకేసి ‘నేనే రాజు.. నేనే మంత్రి’, ‘నాకు ఎవరూ పోటీ కాదు’, ‘పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రి’గా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చనేందుకు ఉదాహరణలు అనేకం. పదే ళ్లు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో పాటు 2028 లోనో, లేక మీరు చెబుతున్నట్లు 2029లోనో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆమోదం కూడా అవసరమే.
2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజార్టీతోనే గెలిచింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు రికార్డు గొ ప్పగా ఏమీ లేదు. పంచాయతీ ఎన్నికలు, పు రపాలక సంఘాల ఎన్నికల్లో మెజార్టీ స్థానా ల్లో గెలిచినప్పటికీ అద్భుత విజయం అని చెప్పలేము. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలం కావడంతో రేవంత్ సర్కార్ పై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ధీ మా సడలిపోయే అవకాశం లేకపోలేదు.
ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అదే ప్రజామోదం అనుకునేంత రాజకీయ అపరిపక్వత కాంగ్రెస్‌కు ఉన్నదని భావించలేం. కం టోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలైనా, పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలైనా.. గెలుపులో ప్రజామోదం కంటే వ్యూ హాలు, పోల్ మేనేజ్మెంట్‌లే ప్రముఖ పాత్ర పోషించాయి గత శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ వైఫల్యాలు కాంగ్రెస్‌ను గెలిపించాయి. అయితే మంచి పాలన అందిస్తే పదేళ్లే కా దు.. జ్యోతిబాసు, పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్ లాగా రేవంత్ కూడా తె లంగాణకు తిరుగులేని రాజకీయ నేతగా చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఇది కూడా ప్రజలే నిర్ణయిస్తారన్నది గుర్తించాలి.
వ్యాసకర్త సెల్: 9885465877