పార్టీ పరిస్థితి ఏంటి?
- పథకాలపై ప్రజా స్పందన ఎలా ఉంది?
- మీనాక్షి నటరాజన్ ఆరా
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రెండు రోజులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో 20 మంది డీసీసీ అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకుల సహకారం ఎలా ఉంది? పార్టీ--ప్రభుత్వం మధ్య సమన్వయం ఏ విధంగా సాగుతోంది? వంటి అంశాలపై ఆమె ఆరా తీశారు. అలాగే ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)కార్యక్రమాలు, ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల అమలు తీరును కూడా సమీక్షించారు.
సర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు? పార్టీ కమిటీల ఏర్పాటు ఎంతవరకు పూర్తయింది? అనే వివరాలను కూడా తీసుకున్నారు.






