30 July, 2026 | 2:44 PM

బీసీలకు రాజ్యాధికారం ఏది?

29-05-2024 01:06 AM

అన్ని వర్గాల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది. రాష్ట్ర సాధన కోసం అందరితో కలిసి పోరాటం చేశాం. స్వరాష్ట్రం రావడం ఎంతో సంతోషకరమైన విషయమైనా.. సమైక్య రాష్ట్రం లో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సగానికి తగ్గించి అన్యాయం చేశారు. సమైక్య రాష్ట్రంలోనూ అగ్రవర్ణాల పెత్తనమే నడిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని వర్గాలు కష్టపడి రాష్ట్రాన్ని సాధిస్తే.. కొన్ని వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవించడం చాలా దుర్మార్గం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచి బీసీలకు న్యాయం చేయాలి. ఎందరో త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలి. విద్య, ఉద్యోగాల్లో బలహీన వర్గాల ప్రజల పట్ల ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలి.

 కే కృష్ణుడు,

బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు


ఉద్యమంలో ఉస్మానియా పాత్ర మరువలేనిది

రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆ నాడు ఉస్మానియా విద్యార్థులంతా జేఏసీగా ఏకమై పోరాటం చేశాం. భాష్పవాయు గోళాలు, లాఠీ దెబ్బలు నిత్యకృత్యంగా ఉన్నా భయపడలేదు. నిర్బంధాలు, కేసులు, జైలు జీవితం అనుభవించాం. ఉస్మానియాను అదుపు చేస్తే చాలని అప్పటి సర్కారు ఎన్ని కుట్రలు చేసినా భయపడలేదు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు అందరూ పోరాటంలో కలిసిరావడంతో రాష్ట్రం ఏర్పడింది. ఉస్మా నియా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఉద్యమంలో పాల్గొనడం మర్చిపోలేని విషయం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ అంశాలపైనే ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ అన్ని రంగాల్లో బాగుపడాలి. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి.

 డాక్టర్ కురువ విజయ్‌కుమార్,

ఉస్మానియా వర్సీటీ జేఏసీ మాజీ అధ్యక్షుడు

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగించిన ఉద్యమానికి, స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనకు ఏమాత్రం పొంతనలేదు. ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యుత్ శాఖకు ఉన్న రూ.13 వేల కోట్ల బకాయిలు ఇప్పడు రూ.50 వేల కోట్లకు చేరాయి. కాంట్రాక్టు కార్మికుల పేరును ఎవరికీ అర్థం కానివిధంగా ఆర్టిజన్‌గా మార్చారు. విద్యుత్‌శాఖలో అవినీతిని ప్రశ్నిస్తే మా యూనియన్ కార్యాలయాన్ని మూసివేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేశారు. ఉద్యమంలో పోరాటం చేసిన వారిని పట్టించుకోకుండా అనర్హులను అందలం ఎక్కించారు. 

 నాగరాజు,
విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ వ్యస్థాపక అధ్యక్షుడు,
హైదరాబాద్

ఉద్యమంలో విద్యార్థిలోకం పిడికిలి బిగించింది

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు పిడికిలి బిగించి పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల ఆరాచకాలను గ్రామగ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించి యువత సైన్యంలా కదిలేలా చైతన్యంచేశాం. నేడు పదేండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకంగా ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరుద్యోగ యువత కోసం కొత్త నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్ని శాఖలపై మంత్రులు, అధికారులు అవగాహనతో పనిచేసినప్పుడే ఆర్థిక లోటు ఉన్న తెలంగాణ, ధనిక రాష్ట్రంగా మారుతుంది. గత ప్రభుత్వం వైఫల్యాలను పదేపదే ఎత్తి చూపకుండా ప్రజాసంక్షేమంపై పరిపాలకులు దృష్టిపెట్టాలి.       

రాజారాంయాదవ్, ఓయూ విద్యార్థి సంఘం నేత