ఎన్టీఆర్ తెలుగుజాతికి గర్వకారణం
ఎల్బీనగర్, మే 28: ఎల్బీనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పనామా చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడని, తెలుగుజాతి కిర్తీ పతాకమని కొనియాడారు. ఎన్టీఆర్ హయాంలోనే నిజమైన సంక్షేమ జరిగిందన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు కరెంట్ సబ్సిడీ, మండలాల వ్యవస్థ, ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇతర అనేక నూతన సంస్కరణలు తెచ్చిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు.
తెలుగుజాతిని, తెలుగువాడి కిర్తీని ఖండాతరాలకు వ్యాపింపచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి అన్నారు. పనామా చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. మరోవైపు, హయత్‌నగర్‌లో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సింగరెడ్డి మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలవర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదల ఆకలి తీర్చిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. హయత్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో మరాఠి భిక్షపతి, దుర్గం మల్లేశ్‌యాదవ్, కటెపాక ప్రవీణ్, పిడుగు రవీందర్‌ముదిరాజ్, జెనిగె మహేందర్, శ్రీనివాస్‌గౌడ్, కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






