10 April, 2026 | 12:03 AM

కాంగ్రెస్‌లోకి కాలె

29-06-2024 12:27 AM

కారు దిగి చెయ్యి అందుకొనె బీఆర్‌ఎస్‌ను వీడిన ఆరోఎమ్మెల్యే

అసెంబ్లీలో 39 నుంచి 32కు పడిపోయిన గులాబీ బలం

బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనానికి కాంగ్రెస్ ప్రయత్నాలు

సొంత నేతలు వ్యతిరేకిస్తున్నా రేవంత్ సీక్రెట్ ఆపరేషన్

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా  సీఎం రేవంత్‌రెడ్డి సీక్రెట్ ఆపరేషన్‌తో  ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుకుంటున్నారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోగా, తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్నది.  కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 65కు చేరుకోగా సీపీఐ ఎమ్మెల్యేతో కలిపి 66 మంది మద్దతు హస్తానికి ఉంది.

హస్తం గూటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువాను కప్పుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్కే కాలె యాదయ్య కూడా ఢిల్లీకి వెళ్లి హస్తం గూటికి చేరుకున్నారు.

క్యూలో మరికొందరు!

బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ముందుకెళ్లుతోంది. అందుకు ఆపరేషన్ ఆకర్ష్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సీక్రెట్‌గానే కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికను కాంగ్రెస్‌లోని కొందరు వ్యతిరేకించినా రేవంత్‌రెడ్డి మాత్రం తన ప్రయత్నాల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలోకి చేరికలు అవసరమని ఢిల్లీ పెద్దలనూ రేవంత్‌రెడ్డి ఒప్పించారని, అందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. పోచారం, సంజయ్ చేరిక అంశంపై కొంత వివాదం జరిగినా వాటిని పక్కనపెట్టి రెండు రోజుల వ్యవధిలోనే యాదయ్యను చేర్చుకోవడం ఆసక్తిగా మారింది.

వీరి బాటలోనే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం గూటికి వస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదారుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఒక్కొక్కరుగా పార్టీ కండువాను కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే చేరికల టాస్క్‌ను పూర్తి చేసి బీఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్‌లో చేరిన కాలె యాదయ్య .. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.