08-12-2025 01:27:30 AM
మన్సూరాబాద్ బచ్ఫన్ స్కూల్ బిల్డింగ్ లో డేంజర్ చదువులు
నివాస బిల్డింగ్‌లో చదువులు, ఇంటిపైన నివాసాలు
ఫిర్యాదు చేసిన పట్టించుకోని జీహెచ్‌ఎంసీ, విద్యాశాఖ అధికారులు
ఎల్బీనగర్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): అదో కార్పోరేట్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఆ స్కూల్ లో చదివేదంతా ముక్కు పచ్చలారని చిన్నారులే...స్కూల్ వరకు తీసుకెళ్లి తమ బిడ్డలను వారి పేరెంట్స్ ఎంతో నమ్మకంగా టీచర్స్, సిబ్బంది చేతిలో పెడతారు. అయితే ఇంత నమ్మకంగా పేరెంట్స్ తమ బిడ్డలను అప్పజెప్పుతున్న ఆ స్కూల్ లో మాత్రం ఆ చిన్నారులకు సేఫ్టీ లేదనే విషయాన్ని ఆ పేరెంట్స్ గుర్తించలేకపోతున్నారు.
ఇది ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని ఉన్న బచ్పన్ స్కూల్ బిల్డింగ్ తతంగం... సాధారణంగా ప్రైమరీ స్కూల్ సరైన మౌలిక సదుపాయాలతో నామ్స్ ప్రకారం ఉండాలి. గ్రౌండ్ ప్లోర్ లో మంచి వెంటిలేషన్ తో పాటు కమర్షియల్ ప్రాంతానికి దూరంగా ఉండాలి, ఫైర్ ఎన్‌ఓసి, ప్లే గ్రౌండ్ ఉండాలి ఇంకా భవనం నాణ్యతా ప్రమాణాలతో అన్ని అనుమతులు (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉండాలి...కానీ, ఈ స్కూల్ మాత్రం ఓ నివాస గృహంలో కొనసాగుతుంది.
నర్సరీ నుండి 5వ తరగతి వరకు కొనసాగిస్తుండగా సుమారు 300 నుంచి 500 మంది విద్యార్థులు చుదువుకుంటున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ కు ఎలాంటి నామ్స్ తో లేదు. పై అంతస్తులో కొంతమంది నివాసం ఉంటున్నారు. గ్రౌండ్ పోర్షన్ తోపాటు రెండు అంతస్తుల్లో స్కూల్ నడుస్తుండగాపై అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఇరుకు గదులు ఇరుకుగా ఉండే మెట్లు...ఇది ఇలా ఉంటే ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే 500 మంది చిన్నారుల భవిష్యత్ ఏంటి అని? ప్రశ్నార్ధకం అయ్యింది. పై అంతస్తులో ఉండే నివాసంలో గ్యాస్ లాంటి ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి.
అక్కడ ఏమైనా ఫైర్ ఏర్పడితే తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది. కనీస మౌలిక వసతులు, సరైన అనుమతులు లేని ఈ బిల్డింగ్ ను బచ్పన్ స్కూల్ యాజమాన్యం ఎలా ఎంచుకుందో తెలియదు. ఈ స్కూల్ కు ప్లే గ్రౌండ్ ఉండదు, ఉంటే ఎక్కడో 100మీటర్ల దూరంలో ఓ చిన్న ప్లాట్ లో ఉంటుంది. స్కూల్ నుంచి గ్రౌండ్ వరకు చిన్నారులు వెళ్లాలంటే రద్దీగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇలా ప్రతీ క్లాస్ కు ఎదో ఓ టైంలో ఆ గ్రౌండ్ కు వెళ్లాల్సిందే. కనీస రక్షణ లేని బిల్డింగ్ లో స్కూల్ కు అనుమతులు ఎలా ఇచ్చారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉండగా అనుమతులు లేని బిల్డింగ్ లో అక్రమ మార్గంలో స్కూల్ కు అనుమతులు తెచ్చుకొని స్కూల్ నడిపే వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఇదే విషయంపై నెల రోజుల క్రితం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ తో పాటు జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొంతమంది పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి కమిషనర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.