17 June, 2026 | 3:49 AM

యుద్ధం ముగిసాకె..`

02-12-2024 12:00 AM

----------------------ఏదైనా

పని మొదలెడతానా

కంటిమీద నిదురుండదు

ఎవరితో వైరం వద్దనుకుంటాను

ఓపికను ఆసాంతం తెచ్చుకుని

నెమ్మది నెమ్మదిగానే

అడుగులేస్తూ పోతాను

మంచికీ చెడుకూ మధ్య

నలుగుతూనే

ధర్మం వైపు మొగ్గేందుకు

శత విధాలా నాతో నేనే

కుస్తీ పడతాను

కాలాన్ని కలానికి చుట్టి

నేను అక్షర సాగర మథనమవుతాను

అంతుచిక్కని లోతుల్లోకి

రాక్షసగణ సమూహంలోకి

హృదయాన్ని నిలువునా చీలుస్తున్న

రంపపు కోతల్లోకీ

అమాంతం నెట్టివేయ బడతాను

దేనికీ దడవను

దేనికీ తలవొగ్గనూ

నన్ను నేను కాపాడుకునేందుకే

యుద్ధం మొదలు పెడతాను

ఎంత వద్దనుకున్నా

ఆయుధం అనివార్యమైతది

మొదలెట్టిన పని ముగియాలి

శత్రు సంహారం జరగాలి

ఒకే ధ్యేయం.. ఒకే భావం

ఒకే వాదం.. ఒకే వేదం

నిరంతర యోధుడినై పోతాను

ఎన్ని గాయాలైనా

నేల కొరగను.. నీళ్లు తాగను

యుద్ధం ముగిసాకె..

దప్పిక తీరుతుంది

నిద్రకు ఉపక్రమిస్తాను..!