16-10-2025 01:48:03 AM
-నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎదురుచూపు
-జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఫిబ్రవరిలోనే..
-19 వేల టీచర్ ఖాళీలను గుర్తించిన అధికారులు
-వీటిలో10,395 ఎస్జీటీ, 4,484 ఎస్‌ఏ పోస్టులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): డీఎస్సీ కోసం దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నా రు. కానీ, ప్రభుత్వం మాత్రం దానిపై ఇంత వరకూ ఓ నిర్ణయం వెలువరించట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అసలు డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తారా? వేయరా? అనే దానిపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. పైగా టీచర్ పోస్టులు సరిపోను ఉన్నాయి కదా! అని సమాధానమిస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని తెలిపింది. కానీ, అక్టోబర్ నెల గడుస్తున్నా ఇంకా ఉపాధ్యాయ నియ మాక ప్రక్రియపై తాత్సారం చేస్తుందనే విమర్శలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిరుద్యోగ యువత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పలువురు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
టీచర్ ఖాళీలు 19వేలు..
విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్యాశాఖ కు సంబంధించిన సమగ్ర నివేదికను రూ పొందించింది. ఈ ఏడాది ఆగస్టు 31వరకు ఉన్న వివరాల ప్రకారం అధికారుల విధులు, పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లోని వసతులకు సంబంధించిన పూర్తివివరాలను అందులో పొందుపర్చా రు. ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లలోని బోధన, బోధనేతర సిబ్బంది లెక్కలను తీశారు.
మొత్తం సాంక్షన్డ్ టీచర్ పోస్టులు 1,25,583 ఉంటే, అందులో ప్రస్తుతం పనిచేస్తు న్న ఉపాధ్యాయులు 1,06,566 మంది ఉండగా, 19,017 ఖాళీపోస్టులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ప్రధానంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ ఖాళీలు 422, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ం 651, ఎస్జీటీ పోస్టులు 10,395 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4484, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 293, పీఈటీ పోస్టులు 313, వొకేషనల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఇతరత్ర పోస్టులు 2459 ఖాళీలున్నాయి. నాన్ టీచింగ్ పోస్టు ల్లో పనిచేస్తున్న వారు 2,686 మంది ఉన్నారు.
అయితే, వీటిలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల ద్వారా గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు భర్తీ చేయగా, 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, మిగిలిన 30 శాతం పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వం ఇటీవల 4వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించింది. ఇలా పదోన్నతులు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు, ఇప్పటికే ఉన్న ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.
టీచర్లు లేకుండా బోధన ఎలా?
గతేడాదిలో ఫిబ్రవరిలో మొత్తం 11,066 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది. దీనికి మొత్తం 2.60 లక్షల మంది వరకు అభ్యర్థులు పోటీ పడ్డారు. అప్పుడు ఉద్యోగాలు రాని వారు, కొత్త వారు మరో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ ఫిబ్రవరిలో డీఎస్సీ వేస్తామని ప్రకటించడంతో దానికోసం దాదాపు 2.50 లక్షల మంది అభ్యర్థులు ఎదు రు చూస్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ తీసుకుం టున్నారు.
అధికారులు మాత్రం విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని గమనిస్తే ఎక్కువ మంది టీచ ర్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు, 7,364 బడుల్లో 15,611 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఏడాది లో రెండు సార్లు నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి, జూన్‌లో రెండోసారి నిర్వహించింది. ఈ రెండింటిలో అర్హత సాధించిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు, కొత్తవాళ్లు ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎస్జీటీ పోస్టుల కోసం దాదాపు 70 వేల మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం 2 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ పూర్తయిన తర్వాత మరో 6 వేల వరకు టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. కానీ ఇంత వరకూ దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశా లలకు ఎక్కువగా ఉన్న చోటు నుంచి తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. చాలా ప్రైమరీ, హైస్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించారు. టీచర్లు లేకుండా విద్యాబోధన ఏ విధంగా చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి.