16-10-2025 01:48:26 AM
నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అవిరళ కృషి చేస్తున్నదని నిజామాబాద్ అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్ తెలిపారు.బోధన్ మండలం నాగన్ పల్లి గ్రామంలో న్యాయసేవ సంస్థ ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి చట్టం ప్రజల ప్రగతి కోసం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభలు తయారు చేస్తాయని అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అత్యుత్తమ వేదికలని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుండి సమాచారం తీసుకోవడానికి లభించిన అమృత కళశమేనని ఆయన తెలిపారు. ప్రజలకు అవసర మైన ప్రతి అధికారిక పత్రాలు ప్రభుత్వ శాఖలు అందజేయాలని చట్టంలో నిర్దేశించారని అన్నారు.
మనకోసం మనం తయారు చేసుకున్న చట్టాలను అనుసరిస్తూ ప్రతివారు గౌరవప్రదమైన నడవడికను అలవర్చు కోవాలని జడ్జి శ్రీనివాస్ అభిలషించారు. నాగన్ పల్లి ఆదరర్ష పల్లెగా విలసిల్లాలని ఆయన అకాంక్షించారు. పచ్చని పంట పొలాలతో అలరారుతున్న గ్రామ వాతావరణంలాగే, చట్టం కూడా అందరు మంచి వాతావరణంలో జీవించాలని కోరుతుందని ఆ దిశగా న్యాయసేవ అధికార సంస్థ తనవంతు ప్రచారాలు చేస్తుందని జడ్జి శ్రీనివాస్ తెలిపారు.
న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతు ప్రతి పౌరునికి చట్టాల ప్రతిఫలాలు చేరే విదంగా సంస్థ శ్రమిస్తున్నదని తెలిపారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతున్నది అన్నారు. గ్రామగ్రామాన చట్టాల విజ్ఞానపు విత్తనాలు చల్లుతున్నామని వాటిని గ్రామస్థులలే సంరక్షించుకోవాలని ఆయన కోరారు.
బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతు న్యాయసేవ సంస్థ ప్రచారోద్యమానికి పోలీస్ శాఖ తనవంతు సహకారం అందిస్తుందని అన్నారు. చట్ట ప్రకారమే అందరు నడుచుకోవాలని, చట్టాలను గౌరవించుకోవడంలోనే ప్రతివారి గౌరవం ముడిపడి ఉందని అన్నారు.
కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్యామ్ రావు, సమ్మయ్య, బోధన్ మండల న్యాయసేవ సంస్థ సభ్యుడు హన్మంత్ రావు, న్యాయవాది ఆశ నారాయణ,బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిబాబు, బోధన్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మచ్చేందర్ రెడ్డి,గ్రామ కార్యదర్శి అజార్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గౌసోద్దీన్,గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రావు, పారా లీగల్ వాలంటీర్స్ పద్మ సింగ్, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.