29 March, 2026 | 1:26 AM

కాకతి రుద్రమదేవి జన్మదినం ఎప్పుడు ?

29-03-2026 12:00 AM

గుంటూరు జిల్లాలోని మందడం.. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ ప్రాంతం. మల్కాపురం /మందడంలో 14న్నర అడుగుల ఎత్తున రాతిస్తంభం మీద కాకతీయ శాసనం చెక్కబడివుంది. ఈ శాసనం రుద్రమదేవి జన్మదిన వేడుకల సందర్భంగా విశ్వేశ్వరశంభు గోళకీమఠానికి గణపతిదేవుడు, రుద్రమదేవి ఇద్దరు చేసిన దాన శాసనం. ఈ శాసనం 1261 మార్చి 25న వేయబడింది.

కనుక మార్చి 25నే రుద్రమదేవి జన్మించి వుంటుందని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. రుద్రమదేవి మరణించేనాటికి 80 యేండ్లు వుంటుం దని ‘కాకతీయులు’ రాసిన పరబ్రహ్మశాస్త్రి భావించాడు. చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి 1289 నవంబరు 25/27న మరణ శాసనం వేయబడ్డది. 

మందడం శాసనం వేసిననాటికి రుద్రమదేవి వయస్సు 50 ఏండ్లు. గణపతిదేవుడు ఆనాటికి వృద్ధుడు. గణపతిదేవుడు తన ఆధ్యాత్మిక గురువు, రాజగురువు విశ్వేశ్వరశంభు.. రుద్రమదేవి జాతకం పరిశీలించి చెప్పినాడో, రుద్రమదేవి రాచకార్య నిర్వహణా సామర్థ్యాలను విశ్లేషించి నిర్ణయం చేసాడో అతని సలహాను ఆదేశంగా స్వీకరించి రుద్రమ జన్మదినం నాడే ఆమెను గణపతిదేవుడు కాకతీయ భావి సామ్రాజ్ఞిగా నిర్ణయ ప్రకటన చేసివుంటాడు. అందువల్లనే రుద్రమదేవి జన్మదిన వేడుకల సందర్భంగా అంతఘనమైన భూ, ధన దానాలను చేశారు.

కాకతీయ రాజ్యానికి స్త్రీని పాలకురాలుగా చేయడాన్ని, కాకతీయులు స్వీకరించిన మతాన్ని గుర్తించడానికి, గోళకీ మఠానికి చేసిన దాన విస్తృతిని తెలుసుకోవడానికి, విశ్వేశ్వరశంభు ఎంత ప్రభావవంతమైన రాజగురువో ఎరుగడానికి, కాకతీయుల చరిత్రలో విశిష్ట పరిణామాన్ని గ్రహించడానికి ఈ శాసనం దోహదపడుతున్నది. కాకతీయులు ఇప్పటి తెలంగాణాలోని వరంగల్ రాజధానిగా తెలుగు రాష్ట్రాలనే కాక కంచి దాక పాలించారు. తెలంగాణ చరిత్రకే కాదు దేశ చరిత్రలోనే రాణి రుద్రమదేవి చరిత్ర అపూర్వమైనది.

శాసనంలోని 42, 43 పంక్తులలో ‘సర్వోర్వీశ కిరీటకుట్టి మతటీవిన్యస్త పాదాంబుజ శాస్త్యేషా చతురంబురాశిరశనం శ్రీరుద్రదేవి భువం’ అని చెప్పడం వల్ల ఈ శాసనం వేసిన నాటికే రుద్రదేవి రాజ్యశాసనకర్తగా, పాలకురాలిగా నియమించబడ్డదని చెప్పవచ్చు.

43వ పంక్తిలోనే ‘యస్య జన్మమహోత్సవో’ అని, 52వ పంక్తిలో ‘ప్రతిబల ప్రధ్వంసి జన్మోత్సవః’ అనడం వల్ల రుద్రమజన్మదినోత్సవం జరుపడం శత్రుబల ధ్వంసం ఉద్దేశంగా చేయబడిందని అనిపిస్తున్నది. 

50వ పంక్తిలో ‘ప్రతిదిశం రుద్రాంబికా కీర్తవ్య’ అని రుద్రమదేవి ప్రశంసింపబడింది. 

ఈ శాసనం రుద్రమదేవి వెలగపూడి (వెలంగపూండి)తో పాటు కృష్ణానది తీరంలో, కండ్రవాటి-వెలనాడులో వున్న మందఱం(మందడం) గ్రామాన్ని అష్టభోగాలతో, సకర్షకంగా (దున్నే రైతులతో) విశ్వేశ్వరశంభుకు దానం చేసింది. ఈ గ్రామం గణపతిదేవుని ద్వారా వాగ్దత్తం చేయబడింది. ఒకే శాసనంలో గణపతిదేవుడు, రుద్రమదేవి ఇద్దరు చేసిన దానవివరాలు ఇవ్వబడ్డాయి.

ఈ శాసనం 2వ ప్రోలుని నుంచి రుద్రమ వరకు కాకతీయ కుటుంబం వంశక్రమాన్నిస్తున్నది.

10, 11, 12, 13 పంక్తులు బ్రహ్మ మానస పుత్రుడైన మరీచి (సప్తర్షులలో ఒకరు) సంతతిలో దుర్జయుడు. ఆ కళంకరహిత క్షత్రియ కులంలో కాకతి రాజులు పుట్టారు అని పేర్కొనబడ్డది. ఈ చంద్రవంశంలో ప్రోలుడు జన్మించాడనడం సహేతుకం అనిపించదు. దుర్జయుడు పాండ వుల పూర్వీకులలో ఒకరు, అట్లా 10మంది దుర్జయులను పౌరాణికంగా గుర్తించవచ్చు. జయంతి రామయ్యపంతులు శాసన విషయాలను చర్చించి, కాకతీయులు క్షత్రియులా? ‘నాకు తెలిసి కాదు’ అంటాడు. విశ్వేశ్వర శంభువే కాకతీయులకు క్షత్రియత్వం ఆపాదించి ఈ శాసన రచన చేశారనిపిస్తుంది. ఈ శాసనం విశ్వేశ్వర శంభువే రచించాడనడానికి ‘కాకతీయుల శాసన సాహిత్యం’ అనే పుస్తకంలో పరబ్రహ్మశాస్త్రి విశ్వేశ్వర శంభు రచనలుగా పేర్కొన్న శాసన రచనలను సాక్ష్యమనవచ్చు.

ఈ శాసనం దాహల దేశపు గురువులలో ఒకరైన సద్భావ శంభు స్థాపించిన గోళకీమఠం గురువుల వరుసలోని వాడైన విశ్వేశ్వర శివదేశికుల గురించి వివరాలు చెప్పబడ్డాయి. ఈ మఠంలో శైవగురువులు శక్తిశంభు, కీర్తిశంభు, విమలశంభు, ధర్మశంభు, విశ్వేశ్వరశంభు విలసిల్లినవారు. ఈ విశ్వేశ్వరశంభు శైవాగమ అంభోనిధి బిరుదాంకితుడు. గణపతిదేవ చక్రవర్తికి దీక్షాగురువు. గణపతిదేవుడు తనను తాను విశ్వేశ్వరశంభుకు ఆధ్యాత్మిక పుత్రుణ్ణని చెప్పకున్నాడు.(ఈతడే శివదేవయ్యని జయంతి రామయ్య పంతులు అభిప్రాయం). 

ఈ శాసనంలో.. విశ్వేశ్వరశంభు ధర్మశంభువు కుమారుడు. రాజుల కిరీటాలు తాకిన పాదాలవాడు. రాజగురువు.

గణపతిదేవుడు మందఱ(మందడం) గ్రామాన్ని సకలాయములతో విశ్వేశ్వర శంభుకు వాగ్దత్తం చేశాడు. రుద్రమదేవి తండ్రి అనుజ్ఞతో వెలంగపూండి(వెలగపూడితో కలిపి అష్ట భోగస్వామ్యంగా, కృష్ణానదిలోని లంకలతో సహా దానం చేసింది. విశ్వేశ్వర శంభు ఇక్కడ విశ్వేశ్వర దేవునికి అంకితం చేసిన విశ్వేశ్వర గోళకి అనే అగ్రహారాన్ని నిర్మించాడు. ఒక మఠాన్ని, ఒక అన్నదాన సత్రాన్ని కట్టించాడు.

ఈ గ్రామంలో నివసించే కుటుంబాలు కాలానన (కాలాముఖ) శైవశాఖ వారు, వివిధ గోత్రాల (10మంది) ద్రావిడ బ్రాహ్మణులకు ‘పెనుంబాక మానదండం’ తో కొలిచిన భూములివ్వబడ్డాయి. రుక్, యజుర్, సామవేదా లు, పాద, వాక్య, ప్రమాణ, వ్యాఖ్యానాలలో విద్యావంతులు, నిష్ణాతులైన వారికి, శుద్ధ శైవమఠం, విశ్వేశ్వర దేవాలయం, విద్యార్థుల నిర్వహణలకు, వైద్యశాలకు, ప్రసూతిగృహానికి (దేశంలోనే తొలిసారిగా నిర్మించబడ్డది), వైద్యునికి, కాయస్థునికి (అకౌంటెంట్), విశ్వేశ్వరాలయంలో 10మంది నాట్యకత్తెలకు, 10మంది వివిధవాద్యగాండ్రకు, వంటలవారికి, 4గురు బ్రాహ్మ ణ పరిచారకులకు,

10 వీరభద్రులకు(గ్రామరక్షకులు, తప్పులుచేసినవారి వృషణాలు, శిరస్సులు, ఉదరాలను ఛేదించే శిక్ష కులు), 20మంది వీరముష్టిలకు, స్వర్ణకారులకు, తామ్రకారుల కు, తాపీమేస్త్రీకి, బుట్టలల్లేవారికి, కమ్మరికి, కులాలునికి, వడ్రంగికి, మంగలికి, శిల్పులకు వేర్వేరుగా కేటాయించబడిన వేర్వేరు భూభాగాల లెక్కలు వివరంగా ఇవ్వబడ్డాయి. బ్రాహ్మణుల నుంచి చండాలురదాక ఉచిత అన్నదాన సత్రానికి కేటాయింపు లివ్వబడ్డాయి. ఇంకా విశ్వేశ్వర శివదేశికులిచ్చిన ఇతర దానాలను గురించి కూడా శాసనంలో చెప్పబడ్డది.

విశ్వేశ్వర శంభు కాళేశ్వర(పురం)లో ఉపలమఠాన్ని, మంత్రకూటనగరం(మంథని)లో విశ్వేశ్వరదేవాలయాన్ని, చంద్రవల్లినగరంలో నందపదంలో, సోమశిలలో, కొమ్మూరులలో లింగప్రతిష్టచేయించి, శ్రీశైలానికి ఈశాన్యంలో వున్న ఏలేశ్వరంలో ఒక మఠం కట్టించాడు. ఈ శాసనాన్ని జయంతి రామయ్యపంతులు పరిష్కరించి, శాసన సారాంశాన్ని విపులంగా వివరించారు. (Journal of the Andhra Historical Research Society, July 1929, 1&2 parts - publishes in 1930)

మందడంలోని పిచ్చిగుడి (విశ్వేశ్వరదేవుడి గుడి) లేక మల్లికార్జున గుడి రాతిపట్టికలలో ఒకదాని మీద వున్న శిల్పం ఒక శైవగురువుది. ఈ శిల్పంలో మూర్తి జటాధరుడు. భుజాలపై జులపాలు, చెవుల నుంచి కుండలాలు ఆనుతున్నాయి. కుడిమోకాలు పైకెత్తి, ఎడమకాలు కిందపెట్టి కూర్చున్నాడు. నడుముచుట్టి వచ్చిన యోగపట్టం కుడిమోకాలు పైనుంచి ధరించివున్నాడు. కుడిచేత యోగపట్టాన్ని పట్టుకుని వున్నాడు. తలచుట్టు రుద్రాక్షమాల ధరించాడు. ఎడమచేయి ఎడమమోకాలిపై వున్నది. మూర్తికి కుడి, ఎడమల సింహాలున్నాయి. రూపునుబట్టి శైవగురువని బోధప డ్తున్నది. ఈతడే విశ్వేశ్వరశంభువు కావచ్చుననిపిస్తున్నది.

ఇంకొక పట్టికా శిల్పంలో అలంకరించబడిన రెండు సింహాల నడుమ కూర్చున్న వ్యక్తి కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు, మెడలో హారాలు... రాజు వేషధారణతో వున్నాడు. అతను కూర్చున్న భంగిమలో మోకాళ్లెత్తి, వాటిమీద మోచేతులానించి, రెండు చేతులతో అంజలిఘటించి వున్నాడు. తలమీద తలపాగానా, కిరీటమా తెలియడం లేదు. ఊహ సరైనదైతే ఈయన గణపతిదేవుని వంటి రాజైవుండాలి అనిపిస్తున్నది.

మరొక శిల్పంలో రెండు సింహాలు ముందరి కుడికాళ్ళతో ఖట్వాంగం ధరించి వున్నాయి. సింహాల తలలమీద కిరీటాలున్నాయి. వాటి నడుమ సిద్ధాసనంలో కూర్చుని వున్న శైవాచార్యుడు వితర్కముద్ర(వ్యాఖ్యానముద్ర)తో కనిపిస్తున్నాడు. సింహానికి కిరీటం పెట్టడం అరుదు. ఖట్వాంగాలు ధరించిన సింహాలు కాపలా వుండడం వల్ల ఆ గురువు ఎంత పెద్దహోదాగల ఆచార్యుడోననిపిస్తున్నది.

మల్కాపురం/మందడం శాసనం శేషభాగాలు నందిశాసనస్తంభం అడుగున 3 పక్కల కొత్త శాసనాలున్నాయి.

అందులో రెండవ పక్క స్తంభం అడుగున “శక సం. యుగపక్షేందౌ చిత్రభానౌచ వత్సరే(సరియైన క్రోనో గ్రాము లేనందువల్ల చిత్రభాను సం. ఆధారంగా) శక సం.1204(క్రీ.శ.1282)లో శ్రావణ బుధవారం సూర్యగ్రహణం నాడు భారద్వాజ గోత్రులైన మొదలిపిల పండితుని కొడుకు మహాదేవ భట్టోపాధ్యాయుడు విశ్వేశ్వర శివాలయంలో అఖండదీపానికిగాను 50 గొర్రెలు, ఈ దీపం నడిపిడికాంపు(వెలిగించు కాపు) సనిగరపు మల్లోబోయిని కొడుకు రామన్నబోయుడు. ఇతనికి ఒక నివేశనము(ఇంటిస్థలం) వ్రిత్తి, నిత్యం 5 మానెడుల నేతిలెక్క ఆచంద్రతారార్రంగా నడుపుటకు ఇవ్వబడ్డాయి” అని శాసనమున్నది.

మూడవపక్కన అడుగున ‘యుగపక్షచంద్రసహితే చిత్రభానౌ శుభే వరుషే చాశ్వయుజే మాసి బహుళ పక్షే త్రితియ్యాతిథౌ...శక సం. 1204 (క్రీ.శ.1282) ఆశ్వయుజ మాసం బ.3న మంత్రి భారద్వాజ గోత్రుడు కొమ్మన ప్రెగడ కొడుకు మల్లయప్రెగడ తమను కాపాడిన రాచగురువు విశ్వేశ్వర దేశికునికి పుణ్యంగా పెట్టిన అఖండదీపానికి 50 గొర్రెలు, ఈ దీపం వెలిగించి నడిపించే బోదకా ఎఱబోయుని కొడుకు పినకల్లెబోయుడు, ఆబమ్మ కొడుకు నూంకెబోయుడు వీరికి ఒక నివేశనము, ఒక వ్రిత్తి నిత్యం 5 మానికల నేయిలెక్క ఆచంద్రార్కంగా నడుపువారు’ అని శాసనం వుంది.

మూడవపక్కనే అడుగున “శాకాబ్దే వేదబిందు ద్విధరణి గణితే (వేదాలు 4, బిందు 0, ద్వి 2, ధరణి 1.. వామాంకగతిలోనికి మారిస్తే) 1204 శక సం. (కార్తీక పూర్ణిమాయాం) కార్తీక పౌర్ణిమరోజు శ్రీవత్సగోత్రులైన రాచగురువు కొడుకులు కాశీశ్వర శివాచార్యులు, విద్యాశివ దేవరలకు తల్లి సోమసాని అమ్మకు పుణ్యముగా విశ్వనాథదేవరకు అఖండ దీపానికి 25మోదాలు(ఆవులు), ఈ దీపం నడిపిడి కాపు ఆదూరిమేకల ఎఱబోయని కొడుకు మారెబోయుడుకి ఒక నివేశనము వ్రిత్తి, నిత్యం 5మానికల నేయిలెక్క ఆచంద్రార్కం నడుపువాడు’ అని శాసనమున్నది.

పై మూడు శాసనాలు మందడంలోని విశ్వేశ్వర శివాలయానికి చెందినవే. వీటిలో ప్రస్తావించిన పేర్లు, సందర్భాలను బట్టి కాకతీయుల రాచగురువు(గణపతిదే వుని కాలం) విశ్వేశ్వర శివునికి పుణ్యంగా ఒక శాసనంలో, అతని పుత్రులు కాశీశ్వర శివాచార్యుడు, విద్యాశివులకు, వారి తల్లి(విశ్వేశ్వర శివుని భార్య)సోమసానికి పుణ్యంగా మరో శాసనంలో మందడం విశ్వేశ్వర శివాలయంలో అఖండదీపం వెలిగించి, నిర్వహించడానికి కాపు బోయల కు నివేశనస్థలాలు, గొర్రెలు, ఆవులు వ్రిత్తిగా ఇవ్వడం గురించి చెప్పబడ్డదని తెలుస్తున్నది.

(South Indian Inscrptions vol.X 452,453,454)