బీఆర్‌ఎస్ వాకౌట్
- పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై సర్కారు నిర్లక్ష్యం!
- ఏడు టీఏలు, ఐదు డీఏలు పెండింగ్
- మా ప్రశ్నలకు మంత్రి పొన్నం నుంచి అష్యూరెన్స్ రాలేదు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి స్పష్టమైన సమాధానం, అష్యూరెన్స్ రానందున ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా అసెంబ్లీ నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. వాకౌట్ కంటే ముందు సభలో హరీశ్‌రావు పద్దులపై మాట్లాడుతూ.. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో దాదాపు 50 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసారని, కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశారని, ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పోలీసుల భద్రత పథకాన్ని ఒక లక్షకు మాత్రమే పరిమితం చేశారని పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టారన్నారు. పోలీసు శాఖకు గత సంవత్సరం కంటే రూ.400 కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు.
తమ ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ రాలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు నిరసనగా, పోలీసు శాఖలో ఉన్న 17వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పనందుకు నిరసనగా, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సబ్ ప్లాన్ నిధల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు నిరసనగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
చర్చ జరుగుతుంటే వాకౌట్ చేస్తారా?: మంత్రి శ్రీధర్‌బాబు
బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని, పదేళ్ల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఏ అంశంలోనూ బీఆర్‌ఎస్ సభ్యులకు చిత్తశుద్ధి లేదని, ముఖ్యమైన అంశాలపై హౌజ్‌లో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేస్తున్నారని, వాకౌట్ చేస్తే రోజంతా చేయాలి కానీ ఇలా బయటకెళ్లి, మళ్లీ అలా హౌజ్‌లోకి వస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ వాకౌట్‌ను ఖండిస్తున్నామని చెప్పారు. ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమమా? పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వాళ్లతో ఒక్కరు కూడా మాట్లాడలేదని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించిందే తమ ప్రభుత్వమన్నారు. ఇంకా తమకు మూడేళ్ల సమయం ఉందని, ఆ తర్వాత కూడా తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనని, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, అప్పుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.




