27 July, 2026 | 10:27 PM

‘కల్యాణలక్ష్మి’ పంపిణీ ఎప్పటికి అవుతుంది?

26-06-2024 12:05 AM

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): హుజూరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద చెక్కుల పంపిణీ ఎప్పటివరకు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీని కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారించారు. చెక్కులు సిద్ధమైనా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు.

చెక్కుల గడువు ఈ నెల 27తో ముగిసిపోతుందని.. ఆలోగా వాటిని బ్యాంకుల్లో జమచేయని పక్షంలో చెల్లవని పేర్కొన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా పిటిషనర్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీని నిలిపివేసిందని అన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ లబ్ధిదారులు అర్హులైన పక్షంలో చెక్కుల గడువు తీరినా మళ్లీ జారీచేస్తామని హామీ ఇచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేసేలోపే వాటి గడువు ముగిసిపోయినట్ల యితే తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉం టుందని పేర్కొన్నారు. చెక్కుల అందజేతలో జాప్యంపై వివరాలు చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.