శ్రీచైతన్య కొంపల్లి క్యాంపస్‌లో దారుణం
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన
ఆహారం సరిగా లేకే మృతిచెందాడని ఆరోపణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి) : అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తారు. కానీ అదే పిల్లలు ప్రయోజకులుగా అవుతారనే ఉద్ధేశంతో దూర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లలో వేస్తున్నారు. కానీ అక్కడ ఎలా ఉన్నాడో, ఏం తింటున్నారో సరిగా తెలుసుకోలేక, మధ్యలో తీసుకెళ్లలేకపోతున్నారు. అలా చేసిన ఓ తల్లిదండ్రుల పంచప్రాణాలు గాలిలో కలిశాయి. రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం చిల్వెర్ గ్రామానికి చెందిన గొడ్డె బీరప్ప, మాధవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మల్లికార్జున్(12)ను గత సంవత్సరం కొంపల్లిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో కె4 బ్రాంచ్‌లో 6వ తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం 7వ తరగతి. సోమవారం మధ్యాహ్నమే తల్లిదండ్రులు మల్లికార్జునను స్కూల్‌లో చేర్పించి వెళ్లిపోయారు. మొదటి రోజంతా స్నేహితులతో కలిసి కలివిడిగా తిరిగిన మల్లికార్జున్ రాత్రి అందరితో పాటే భోజనం చేశాడు. తర్వాత నిద్రకు ఉపక్రమించాడు.
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి ఏడుస్తూ కూర్చున్నాడు. తోటివారంత అతనికంటే చిన్నవారు కావడంతో ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. మంగళ వారం ఉదయం అందరితో పాటు నిద్రలేవకపోవడంతో తోటి విద్యార్థులు స్కూల్ నిర్వాహకులకు చెప్పారు. కొన ఊపిరితో ఉన్నాడని గ్రహించి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతోపాటు అదే హాస్టల్‌లో చదువుతున్న ఇతర పిల్లల తల్లిదండ్రులు క్యాంపస్‌కు చేరుకున్నారు. సరైన భోజనం పెట్టకపోవడం వల్లే మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా స్కూల్ వద్దకు చేరుకుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






