calender_icon.png 13 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు సామాజిక న్యాయమెప్పుడు?

13-11-2025 12:00:00 AM

కె. వీరస్వామి :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980వ దశకంలో బీసీ విద్యార్థి సంఘం పేరు మీద హైదరాబాద్ నుంచి బీసీ హాస్టళ్లకు ఉత్తరాలు వచ్చేవి. వాటి మీద ఆర్. కృష్ణయ్య పేరు ఉండేది. అయితే ఆర్. కృష్ణ య్య కాకుండా ఒక్కోసారి ఆయన సహచరుడు వకుళాభరణం కృష్ణమోహన్ పేరిట కూడా లేఖలు వచ్చేవని బీసీ హాస్టళ్ల విద్యార్థులు చెప్పేవారు. అప్పుడున్న పార్టీల్లో బీసీలకు సంబంధించిన ఏ విషయాలు చర్చకు రాకపోవడంతో విద్యార్థి సంఘా ల్లో బీసీలపై ఎలాంటి చర్చలు జరిగేవి కాదు.

ప్రధానంగా స్కాలర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల పెంపుదల కో సం మాత్రమే విద్యార్థి సంఘాల ఉద్యమా లు జరిగేవి. అయితే వీటన్నింటిలో గొప్ప విద్యార్థి ఉద్యమంగా చెప్పుకోవలసింది మాత్రం.. 1989లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా జరిగి న పోరాటమే.

దాని ఫలితంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిం ది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటం టే ఆ రోజుల్లో దాదాపు అన్ని విద్యార్థి సం ఘాల్లో ముఖ్యమైన పదవులన్నింటిలోనూ అగ్ర కులాల విద్యార్థులే ఎక్కువగా వుండేవారు. నాయకత్వ స్థానాలను అగ్ర కులా లు ఆక్రమిస్తే, బీసీలు లేదా ఎస్సీ, ఎస్టీలు కార్యకర్తల కింది స్థాయిలో పని చేసేవారు. 

మారిన ముఖచిత్రం

భారత ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక విధానం దేశంలోని అన్ని రంగాల్లో తీవ్రమైన మార్పుల కు పునాది వేసింది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన ప్రభుత్వరంగం ప క్కనే ప్రైవేటు రంగ సంస్థలను నెలకొల్పడానికి అవకాశాలు ఇవ్వడం మొదలైంది. దాంతో మొట్టమొదటగా ప్రైవేటు రంగం లో విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. మ రోవైపు ఉదారవాద విధానాల్లో భాగంగా వచ్చిన అవకాశాలతో రక్షణ రంగంలో బో ఫోర్స్ కుంభకోణం జరిగితే ఆ శాఖ మం త్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వి.పి. సింగ్) దానిని బయటికి తీశారు. దీంతో ఆయనను ఆ శాఖ నుంచి తప్పించి ఆర్థిక మంత్రి పదవి అప్పజెప్పారు. కానీ ఆర్థిక మంత్రిగానూ వి.పి.సింగ్ ఆ శాఖలో ‘ఫెయిర్ ఫాక్స్’ కుంభకోణాన్ని వెలికితీశారు. ఫలితంగా ప్రభుత్వం సహా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ‘జనమోర్చా’ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని దేశ వ్యాప్తం గా నడపడంలో వి.పి. సింగ్ విజయవంతమయ్యారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో ఆయన నాయకత్వాన నాలుగు పార్టీలు కలిసి జనతాదళ్ పార్టీగా ఏర్పడి.. ఒకవైపు బీజేపీ, మరోవైపు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన జనతాదళ్‌కు బయటి నుంచి మద్దతు లభించ డంతో వి.పి. సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత తన పార్టీకి కూడా కాంగ్రెస్‌కున్న ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు బలం తన పార్టీకి అవసరమని గుర్తించిన వి.పి సింగ్ మండల్ కమీషన్ నివేదికను దు మ్ము దులిపి విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో సఫలీకృతమయ్యారు. ఏది ఏమైనా వి.పి సింగ్ ప్రభుత్వం తీసుకున్న చర్య.. దేశ రాజకీయ, సామాజిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఉపయోగపడిందని భావిం చొచ్చు. బీసీల కోణంలో ‘భారత రాజ్యాం గ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, బీసీలకు రాజ్యాంగం ప్రకారం జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’ అని ప్రధాని హోదా లో వి.పి.సింగ్ పేర్కొన్న మాటలు ఇప్పటికీ బీసీ వర్గాలు గుర్తుచేసుకుంటూనే ఉన్నాయి.

బీసీల అణచివేత

ప్రధాని వి.పి. సింగ్ చర్యతో బెంబేలెత్తిన అగ్ర కులాలు, వారి ప్రయోజనాల కోసం ఏర్పాటైన బీజేపీ మండల్ కమీషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి తెర లేపింది. ఈ ఉద్య మానికి బీజేపీ తన మానస పుత్రిక అయిన విద్యార్థి పరిషత్ సంఘాన్ని పరోక్షంగా ఆ ఉద్యమం వెనుక నిలబెట్టి ఎవరికీ సంబం ధం లేని వారు చేస్తున్న ఉద్యమంగా ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా అన్నది ఆలోచించాలి. మరోవైపు అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం ఉన్న ప్రదే శంలోనే రాముడు జన్మించాడు కాబట్టి దానిని కూల్చివేసి ఆ స్థానంలో రామునికి గుడి కట్టాలి అని మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా కమండల్ లేదా మందిర్ కో సం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా కన్యాకు మారి నుంచి రథయాత్ర ప్రారంభించిన ఎల్.కే. అద్వానీ బీహార్‌లోకి ప్రవేశించగానే అప్పటి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ యాత్రను అడ్డుకొని అద్వానీని అరెస్ట్ చేయడంతో.. అప్ప టిదాకా వి.పి. సింగ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిచ్చిన బీజేపీ  దానిని ఉపసంహరించుకుంది. దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ప్రధానమంత్రి పదవికి వి.పి.సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం దేశ వ్యాప్తంగా వి. పి.సింగ్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఉంటే బాగుండేది, కానీ అలా జరుగలేదు. అందుకు కారణాలు అనేకమున్నా ప్రధానమైనది మాత్రం అప్పటికీ మెజారిటీ బీసీ విద్యార్థులంతా వర్గ భావనతో పనిచేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల కింద అణచివేతకు గురవ్వడమే! 

కుట్రపూరిత చర్యలు

ఆ తర్వాత 1991లో అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టిన ఉదారవాద విధానాలను వేగంగా అమలు చేశారు. అదే సమయంలో వి.పి. సింగ్ కేంద్ర ప్రభు త్వ విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. దీంతో బీసీలు మేల్కొంటే తమ ఉనికికి ప్రమాదమనే ఆలోచనతో రిజర్వేషన్లు అమలవుతు న్న ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడానికి ఉదారవాదములో భాగంగా సరళీకరణ అని చెప్పి కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేయడం మొదలయ్యింది. భవిష్యత్తులో బీసీలు కోలుకోకుండా చేయాలనే దురుద్దేశ్యంతో, రిజర్వేషన్లు అమలయ్యే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సిక్ ఇండస్ట్రీస్‌గా ముద్రవేసి, మూసి వేయడం లేదంటే అమ్మివేయడం చేసేవారు. ఒకవైపు వాటి ని పరిరక్షించుకుంటూనే మరోవైపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం అనే రెండు కర్తవ్యాలు బీసీ సంఘాల ముందు ఏర్పడ్డాయి. ఇదే అదనుగా భావించి కాంగ్రెస్ పార్టీ మీదున్న వ్యతిరేకతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని ప్రధాన పార్టీ గా అవతరించింది, ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా బీసీ మేధావుల్లో మేధోమధనం ప్రారంభమైంది.

 వ్యాసకర్త సెల్: 9849867032